Telugu Global
Telangana

వచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు - కేసీఆర్

గత 8 ఏళ్లలో అద్భుతమైన విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌ను పవర్ సెంటర్‌గా మార్చామన్నారు. కానీ అసమర్థ‌ ప్రభుత్వం వల్ల కరెంటు కోతలు తప్పట్లేదన్నారు.

వచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు - కేసీఆర్
X

వంద రోజుల కాంగ్రెస్‌ పాలనలో రెండు వందల మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. సూర్యాపేట, జనగాం, నల్గొండ జిల్లాల్లో ఎండిన పంటల పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నీళ్లిస్తుందన్న నమ్మకంతోనే రైతులు పంటలు వేసుకున్నారని చెప్పారు. ఇది వచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువన్నారు కేసీఆర్. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గత పదేళ్లలో వ్యవసాయ స్థిరీకరణ కోసం స్పష్టమైన విధానాలతో ముందుకెళ్లామన్నారు కేసీఆర్. సాగునీరు, 24 గంటల కరెంటు, పంట కొనుగోళ్లు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు 30, 40 టన్నుల ధాన్యం పండించే స్థాయి నుంచి తెలంగాణ వ‌చ్చిన త‌రువాత 3 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి తీసుకెళ్లామన్నారు. కానీ కేవలం వంద రోజుల వ్యవధిలో పరిస్థితి పూర్తిగా తారుమారైందన్నారు. సీఎం ఢిల్లీ యాత్రలు, మంత్రులు దొంగల్లా ప్రభుత్వం తయారైందన్నారు.

గత 8 ఏళ్లలో అద్భుతమైన విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌ను పవర్ సెంటర్‌గా మార్చామన్నారు. కానీ అసమర్థ‌ ప్రభుత్వం వల్ల కరెంటు కోతలు తప్పట్లేదన్నారు. ఇన్వెర్టర్లు, కన్వెర్లర్ల వ్యాపారం మళ్లీ మొదలైందన్నారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారంటూ కాంగ్రెస్‌ సర్కార్‌పై ఫైర్ అయ్యారు కేసీఆర్. ట్యాంకర్ల వ్యాపారం మళ్లీ వచ్చిందంటూ ఆరోపణలు చేశారు.

ఇక పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతలపై పరోక్షంగా స్పందించారు కేసీఆర్. కుక్కలు, నక్కలను లాక్కుని సంతోష పడుతున్నారని కామెంట్ చేశారు. ఎమ్మెల్యేలను లాక్కోవడం చీప్ పాలిటిక్స్ అన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ మహా సముద్రం అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు కాంగ్రెస్‌ను వెంటాడుతామన్నారు కేసీఆర్.

First Published:  31 March 2024 3:05 PM GMT
Next Story