Telugu Global
Telangana

ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం.. ఎక్కడంటే..?

జక్కంపూడి సమీపంలో మూడు స్థలాలను ఎంపిక చేశారు. వీటిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈనెల 18 లేదా 19 తేదీల్లో పరిశీలిస్తారు. ఒకదాన్ని ఎంపిక చేసి, అక్కడ నిర్మాణం ప్రారంభిస్తారు.

ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం.. ఎక్కడంటే..?
X

ఈనెల 14న ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్న వేళ, ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ కార్యాలయాల నిర్మాణానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ ప్రాంతీయ కార్యాలయాన్ని త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం విజయవాడ సమీపంలో మూడు ప్రాంతాలను పరిశీలించారు. వీటిలో ఒకటి ఖరారు చేస్తారు.

జక్కంపూడి సమీపంలో మూడు స్థలాలను ఎంపిక చేశారు. వీటిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈనెల 18 లేదా 19 తేదీల్లో పరిశీలిస్తారు. ఒకదాన్ని ఎంపిక చేసి, అక్కడ నిర్మాణం ప్రారంభిస్తారు. నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలు పెడతారు. ఇప్పటికే ఏపీలో బీఆర్ఎస్ తరపున పనిచేసేందుకు చాలామంది నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రకటన వచ్చినప్పుడు, తాజాగా బీఆర్ఎస్ కి ఈసీ ఆమోదం తెలిపినప్పుడు కూడా విజయవాడలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పుడు జక్కంపూడిలో ఎంపిక చేసిన మూడు స్థలాల వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం అంటూ ఫ్లెక్సీలు వేశారు నాయకులు.

ఏపీలో ఏమేరకు..

ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఏమేరకు ఉంటుందో ముందు ముందు తేలిపోతుంది. ఏపీ ఉద్యోగులతో పోల్చి చూస్తే, తెలంగాణలో ఉద్యోగులకు మెరుగైన వేతనాలున్నాయి. పీఆర్సీ విషయంలో కేసీఆర్ సర్కారు ఉద్యోగుల పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకుంది. పారా మెడికల్, కాంట్రాక్ట్ సిబ్బందిని తెలంగాణలో పర్మినెంట్ చేసేందుకు జీవో-16 విడుదల చేశారని, కానీ ఏపీలో వారి పరిస్థితి దారుణంగా ఉందన్నారు తెలంగాణ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం నేతలు. విజయవాడలో జరిగిన ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం సర్వజన మహాసభల్లో పాల్గొన్న తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు తమ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వివరించారు. ఉద్యోగుల విషయంలోనే కాదు, ఉద్యోగాల విషయంలో కూడా తెలంగాణలో వచ్చినన్ని నోటిఫికేషన్లు ఏపీలో రాలేదు. సచివాలయ పోస్ట్ లు లక్షల సంఖ్యలో భర్తీ చేశామంటున్నారు కానీ, గ్రూప్స్ నోటిఫికేషన్లు, డీఎస్సీ.. ఇతరత్రా ఖాళీలను అస్సలు పట్టించుకోలేదు. ఇక మిషన్ భగీరథ, దళితబంధు, వందల సంఖ్యలో గురుకులాల ఏర్పాటు, అక్కడి పారిశ్రామిక విధానాలు చూసి క్యూ కడుతున్న పరిశ్రమలు.. ఇవన్నీ తెలంగాణకు సానుకూల అంశాలు. ఎన్నికలప్పుడు కచ్చితంగా ఈ పోలికలన్నీ బయటకొస్తాయి. ఏపీనుంచి బీఆర్ఎస్ కి బలమైన నాయకులు ప్రాతినిధ్యం వహిస్తే.. రెండో తెలుగు రాష్ట్రంలో కూడా ఆ పార్టీ బలపడటం ఖాయం. విజయవాడలో ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుతో దీనికి తొలి అడుగు పడబోతోంది.

First Published:  12 Dec 2022 2:54 AM GMT
Next Story