Telugu Global
Telangana

తెలంగాణ స‌బ్బండ వ‌ర్గాల మ‌ద్ద‌తూ బీఆర్ఎస్‌కే.. ఎందుకంటే?!

అధికార భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్‌), ఆ పార్టీ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు సీఎంగా పాల‌న సాగిస్తుండ‌గా, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్ర‌గ‌తి దిశ‌గా ప‌రుగుప‌రుగునా దూసుకెళ్తున్న‌ది.

తెలంగాణ స‌బ్బండ వ‌ర్గాల మ‌ద్ద‌తూ బీఆర్ఎస్‌కే.. ఎందుకంటే?!
X

ప్రధాని న‌రేంద్ర‌మోదీ.. హోంమంత్రి అమిత్‌షా స‌హా బీజేపీ నాయ‌క‌త్వం అంతా కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని ప్రచారం చేసినా ప్ర‌యోజ‌నం లేకపోయింది. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో క‌న్నడిగులు స్ప‌ష్ట‌మైన తీర్పు చెప్పారు. అవ‌కాశవాద రాజ‌కీయాల‌కు తావు లేద‌ని, స్థిర‌మైన లౌకిక ప్ర‌భుత్వానికే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తేల్చేశారు. క‌ర్ణాట‌క కొన‌సాగింపుగా తెలంగాణ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ వంటి ప్ర‌ధాన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు ఈ ఏడాది చివ‌ర్లో జ‌రుగుతాయి. కన్న‌డిగుల విస్ప‌ష్ట‌మైన తీర్పు దేశ ప్ర‌జ‌ల‌కు ఒక సందేశాన్నిచ్చింది. లౌకిక పార్టీల పాల‌న‌తోనే దేశానికి శ్రేయ‌స్సు, అభివృద్ధి సాధ్య‌మ‌ని తేల్చి చెప్పింది.

స‌రిగ్గా తొమ్మిదేండ్ల కింద‌ట పురుడు పోసుకున్న తెలంగాణ అతి త‌క్కువ కాలంలోనే అభివృద్ధి దిశ‌గా వ‌డివ‌డిగా ప‌రుగులు తీస్తున్న‌ది. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌న్న‌న‌ల‌ను పొందుతూ అంద‌రికీ సంక్షేమ ఫ‌లాలు అందించేలా ముందుకు సాగుతున్న‌ది. అధికార భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్‌), ఆ పార్టీ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు సీఎంగా పాల‌న సాగిస్తుండ‌గా, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్ర‌గ‌తి దిశ‌గా ప‌రుగుప‌రుగునా దూసుకెళ్తున్న‌ది.

అతి త‌క్కువ కాలంలో గోదావ‌రి న‌దిపై ఎత్తిపోత‌ల ప‌థ‌కం `కాళేశ్వ‌రం` ప్రాజెక్టు పూర్తి కావ‌డంతోపాటు దాదాపు తెలంగాణ అంతా స‌స్య‌శ్యామ‌ల‌మైంది. రాష్ట్రానికే త‌ల‌మానికంగా ఉన్న హైద‌రాబాద్‌లో 2014 వ‌ర‌కు ఉన్న ఐటీ రంగ ప‌రిశ్ర‌మ‌ల‌ను మ‌రింత విస్త‌రించి అంత‌ర్జాతీయ ఖ్యాతి తెచ్చుకున్న‌ది తెలంగాణ‌. రైతు బంధు, క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్‌, కేసీఆర్ కిట్స్‌, కార్పొరేట్ సంస్థ‌ల‌కు దీటుగా గురుకులాల్లో ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు విద్యాబోధ‌న‌, దాదాపు ప్ర‌తి జిల్లాకో మెడిక‌ల్ క‌ళాశాల‌తో సామాన్యుల‌కు వైద్య విద్య‌ను అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ‌. వైద్య క‌ళాశాల‌ల‌తోపాటు సామాన్యుడికి ప్ర‌భుత్వ ఖ‌ర్చుల‌తోనే వైద్య వ‌స‌తులు క‌ల్పిస్తున్న‌ది. ఢిల్లీలో మొహ‌ల్లా క్లినిక్ త‌ర‌హాలో తెలంగాణ‌లో బ‌స్తీ ద‌వాఖాన‌, ప‌ల్లె ద‌వాఖాన పేరిట సగ‌టు తెలంగాణ పౌరుడికి ద‌గ్గ‌ర‌య్యేందుకు తెలంగాణ స‌ర్కార్ కృషి చేస్తున్న‌ది.

కేంద్రంలోని న‌రేంద్ర‌మోదీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిక‌రంగా పోరాడుతున్న‌ది. జీఎస్టీలో వాటా మొద‌లు రాష్ట్ర విభ‌జ‌న హ‌క్కులు క‌ల్పించాల‌ని, రైతుల‌కు భ‌రోసా క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తున్న‌ది. విప‌క్ష పార్టీల‌పై వేధింపుల‌కు వ్య‌తిరేకంగా ఈ క్ర‌మంలో మైనారిటీల‌కు అధికార బీఆర్ఎస్ చేరువైంది. ఫ‌లితంగా ముస్లిం మైనారిటీలు, క్రిస్టియ‌న్లు, ద‌ళిత‌, గిరిజ‌నులు బీఆర్ఎస్‌కు బాస‌ట‌గా నిలిచారు.. నిలుస్తున్నారు.

కానీ, 2014లో తెలంగాణ క‌ల సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత‌ల్లో ఒక‌రంటే మ‌రొక‌రికి ప‌డ‌ని ప‌రిస్థితి. పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోక‌డ‌లు సీనియ‌ర్ల‌కు రోజురోజుకు దూరం చేస్తున్నాయి. బీజేపీ డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ నినాదానికి దీటుగా క‌న్న‌డ కాంగ్రెస్ నేత‌లు డీకే శివ‌కుమార్‌, సిద్ద రామ‌య్య త‌మ‌ది `జోడెద్దుల‌` స‌వారీ అని స‌మాధానం ఇచ్చి ఐక్య‌త ప్ర‌ద‌ర్శించారు. ఎన్నిక‌ల్లో విజ‌యానికి కృషి చేశారు. ఇప్పుడు అధికారానికి బాట‌లు వేశారు.

కానీ, తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల తీరు ఎవ‌రికి వారే య‌మునా తీరు అన్న‌ట్లు ఉంటుంది. పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అంటే సీఎల్పీ నేత మ‌ల్లుభ‌ట్టి విక్ర‌మార్క‌కు ప‌డ‌దు..ఇక కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.. జ‌గ్గారెడ్డి వంటి వారు వీలు చిక్కిన‌ప్పుడు రేవంత్ మీద విమ‌ర్శ‌లు ఎక్కు పెడ‌తారు. మిగ‌తా నేత‌లు సంద‌ర్బోచితంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. తెలంగాణ కాంగ్రెస్ రెండు గ్రూపులుగా చీలిపోయింద‌న్న‌ది చేదు వాస్త‌వం. కాగ‌డా వేసి చూసిన ఐక్య‌త కాన రాదు.

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచినంత మాత్రాన తెలంగాణ‌కు వ‌ర్తిస్తుంద‌ని భావిస్తే త‌ప్పులో కాలేసిన‌ట్లేనని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. క‌న్న‌డ నేల‌పై ఓట‌మి పాలైనా.. తెలంగాణ‌లో త‌మ‌దే అధికారం అని బండి సంజ‌య్ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు హాస్యాస్ప‌దం అని అంటున్నారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మెజారిటీ స్థానాల్లో పోటీ చేసేందుకు స‌మ‌ర్థ నేత‌లు అవ‌స‌రం. ఆ ప‌రిస్థితి బీజేపీకి తెలంగాణ‌లో ఇప్ప‌ట్లో లేదు. మాజీ మంత్రి, ఈట‌ల రాజేంద‌ర్ సార‌థ్యంలోని చేరిక‌ల క‌మిటీ.. ఇటీవ‌ల బీఆర్ఎస్ బ‌హిష్కృత నేత‌లు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావుల‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు పూర్తిగా ఫ‌ల‌ప్ర‌దం కాలేదు. అందునా క‌ర్ణాట‌క‌లో బీజేపీ ఓట‌మి త‌ర్వాత పొంగులేటి బృందం భిన్న‌మైన నిర్ణ‌యాలే తీసుకునే అవ‌కాశాలే క‌నిపిస్తున్నాయి.

ఈ త‌రుణంలో బీఆర్ఎస్‌కు తామే ప్ర‌త్యామ్నాయం అని కాంగ్రెస్‌, బీజేపీ ఎంత ప్ర‌చారం చేసుకున్నా, చేసినా ఉప‌యోగం ఉండ‌ద‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. దీనికి తోడు ముస్లిం మైనారిటీలు, హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల స్థిర‌ప‌డిన సీమాంధ్రుల‌కు బీఆర్ఎస్ పూర్తి ర‌క్ష‌ణ క‌వ‌చం క‌ల్పించింది. క‌నుక తెలంగాణ‌కు వ‌చ్చే ఐదు నెల‌ల్లో జ‌ర‌గే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ సీఎం కేసీఆర్ సార‌థ్యంలోని బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజ‌యం సాధించ‌డానికే సానుకూల ప‌రిస్థితులు ఉన్నాయి. తెలంగాణ స‌బ్బండ వ‌ర్గాల మ‌ద్ద‌తూ బీఆర్ఎస్‌కే.

First Published:  15 May 2023 7:02 AM GMT
Next Story