Telugu Global
Telangana

బీఆర్ఎస్ బీ ఫామ్ లు రెడీ.. అభ్యర్థులకు ఇచ్చేది ఎప్పుడంటే..?

ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై చర్చ అనంతరం అభ్యర్థులకు బీ ఫామ్ లు, చెక్కులు తానే స్వయంగా అందిస్తారు కేసీఆర్.

బీఆర్ఎస్ బీ ఫామ్ లు రెడీ.. అభ్యర్థులకు ఇచ్చేది ఎప్పుడంటే..?
X

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ బీ ఫామ్ లు రెడీ అయ్యాయి. ఈనెల 18వతేదీన వాటిని ఆయా అభ్యర్థులకు స్వయంగా కేసీఆర్ అందజేస్తారు. ఈమేరకు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బీ ఫామ్ లు ఇచ్చే సమయంలోనే అభ్యర్థులకు ప్రచార ఖర్చుల నిమిత్తం రూ.95 లక్షల చెక్కుని కూడా కేసీఆర్ అందిస్తారు.


కీలక సమావేశం..

బీ ఫామ్ లు అందించడంతోపాటు.. లోక్ సభ అభ్యర్థులు, ఇతర సీనియర్ నేతలతో ఈనెల 18న తెలంగాణ భవన్ లో కీలక సమావేశం జరగబోతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుధీర్ఘ సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై చర్చ అనంతరం అభ్యర్థులకు బీ ఫామ్ లు, చెక్కులు అందిస్తారు. ఈ సమీక్షలో పాల్గొనాల్సిందిగా ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ ముఖ్యలకు ఆహ్వానాలు అందాయి.

బస్సుయాత్రపై తుది చర్చ..

అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా బీఆర్ఎస్ డీలా పడలేదు. నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోతున్నా కూడా ఆందోళన చెందలేదు. లోక్ సభ ఎన్నికలకోసం కేసీఆర్ సహా బీఆర్ఎస్ శ్రేణులు సర్వ సన్నద్ధం అవుతున్నాయి. ఇటీవల కేసీఆర్ బహిరంగ సభలకు కూడా ప్రజాదరణ బాగుందని రిపోర్ట్ లు అందాయి. ఈ దశలో మరింత కష్టపడితే కాంగ్రెస్ పై బదులు తీర్చుకునే అవకాశం లభిస్తుందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ పాలన సరిగా లేదనే విషయాన్ని లోక్ సభ ఎన్నికల ద్వారా నిరూపిస్తామంటున్నారు. ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు కేసీఆర్ కూడా బస్సుయాత్రకు బయలుదేరుతున్నారు. ఈ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పై ఈనెల 18న జరిగే సమీక్షలో తుది నిర్ణయం తీసుకుంటారు.

First Published:  16 April 2024 12:06 PM GMT
Next Story