Telugu Global
Telangana

సీఎం కేసీఆర్ పాత స్ట్రాటజీ.. ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం?

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా అధికారికంగా మారిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఇవే. దీంతో బీఆర్ఎస్ తప్పకుండా పోటీ చేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

సీఎం కేసీఆర్ పాత స్ట్రాటజీ.. ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం?
X

అధికార బీఆర్ఎస్ పార్టీ రాబోయే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. మార్చి 13న తెలంగాణలోని రెండు సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఒకటి, స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి మరో ఎమ్మెల్సీని ఎన్నుకోవల్సి ఉన్నది. కాగా, ఈ రెండు సీట్లకు బీఆర్ఎస్ తరపున అభ్యర్థులను నిలపకూడదని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఇంత వరకు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించలేదు. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా అధికారికంగా మారిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఇవే. దీంతో బీఆర్ఎస్ తప్పకుండా పోటీ చేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే పాత స్ట్రాటజీనే అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఏఐఎంఐఎం అభ్యర్థికి, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో పీఆర్టీయూ-టీఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.

2017లో ఈ రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగినప్పుడు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీకి, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కాటేపల్లి జనార్థన్ రెడ్డి (పీఆర్టీయూ-టీఎస్)కు మద్దతు తెలిపింది. వీరిద్దరి పదవీ కాలం వరుసగా మే 1, మార్చి 29న ముగియనున్నది. అందుకే ఎన్నికల కమిషన్ మార్చి 13న ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణయించింది.

కాగా, ఎంఐఎం ఎవరిని నిలబెట్టినా బీఆర్ఎస్ మద్దతు తెలిపే అవకాశం ఉన్నది. అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో పీఆర్టీయూ-టీఎస్‌కే మద్దతు ఇచ్చినా.. అభ్యర్థిని మార్చాలని కోరే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. పీఆర్టీయూ అభ్యర్థి పట్ల సీఎం కేసీఆర్ పలు సూచనలు చేయవచ్చని సమాచారం. నామినేషన్లు దాఖలు చేయడానికి ఫిబ్రవరి 23 వరకు, నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 27 వరకు సమయం ఉన్నది. మార్చి 13న పోలింగ్ నిర్వహించి. మార్చి 16న కౌంటింగ్ జరుపుతారు.

First Published:  14 Feb 2023 7:01 AM GMT
Next Story