Telugu Global
Telangana

మధ్యతరగతి సొంతింటి కల నెరవేర్చేందుకు బీఆర్ఎస్ సరికొత్త పథకం..

హైదరాబాద్‌ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో ఏ ప్రాంతం నుంచయినా ఒక గంటలోనే హైదరాబాద్‌ చేరుకునేలా రవాణా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. అర్బన్‌ పార్క్‌ ల సంఖ్య పెంచుతామన్నారు.

మధ్యతరగతి సొంతింటి కల నెరవేర్చేందుకు బీఆర్ఎస్ సరికొత్త పథకం..
X

సొంత ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి ఓ కల. ఉన్నతాదాయ వర్గాలు ఆ కలను సునాయాసంగా నెరవేర్చుకుంటాయి. తగినంత డబ్బు చేతిలో లేకపోయినా బ్యాంకులు వారిని ఆదుకుంటాయి. మధ్యతరగతి వారికి బ్యాంకు రుణాలు సమస్యగా మారతాయి, పేదలకు మాత్రం స్థలం, రుణం.. ఇలా అన్ని సమస్యలుంటాయి. తెలంగాణలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తోంది ప్రభుత్వం. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి గృహలక్ష్మి పథకం ఉంది. వీటికి సమాంతరంగా మధ్యతరగతి వారి కోసం మరో కొత్త పథకాన్ని తెరపైకి తేవాలని చూస్తోంది బీఆర్ఎస్. ఈ మేరకు మంత్రి కేటీఆర్ చిన్న హింటిచ్చారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) ఆధ్వర్వంలో జరిగిన రియల్‌ ఎస్టేట్‌ సదస్సులో పాల్గొన్న ఆయన.. కేసీఆర్ మనసులో ఓ మహత్తర ఆలోచన ఉందని చెప్పారు.


బ్యాంకు రుణంతో 1,200 నుంచి 1,500 చదరపు అడుగుల మధ్య ఇల్లు కొనుగోలు చేసేవారికి బీఆర్ఎస్ ప్రభుత్వం సాయం అందించాలని ఆలోచన చేస్తోంది. వారు తీసుకున్న లోన్ కు వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. ఈఎంఐలో.. అసలు లబ్దిదారుడు చెల్లిస్తే, వడ్డీ ప్రభుత్వం తరపున చెల్లిస్తారు. దీనిపై సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీన్ని అమలులో పెడతారని చెప్పారు మంత్రి కేటీఆర్.

ధరణి సమస్యలు పరిష్కరిస్తాం..

గతంలో లంచం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్లు జరిగేవి కావని, ఇప్పుడు ధరణితో పారదర్శకంగా ఒకే రోజు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ జరుగుతున్నాయని చెప్పారు మంత్రి కేటీఆర్. ధరణిలో సమస్యలను పరిష్కరించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.

హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక..

హైదరాబాద్‌ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో ఏ ప్రాంతం నుంచయినా ఒక గంటలోనే హైదరాబాద్‌ చేరుకునేలా రవాణా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్, పునరుత్పాదక విద్యుత్‌ కు ప్రాధాన్యత ఇస్తామని, ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్యను పెంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెప్పారు. హైదరాబాద్ లో అర్బన్‌ పార్క్‌ ల సంఖ్య పెంచుతామన్నారు కేటీఆర్.

కాంగ్రెస్ సోషల్ మీడియా హడావిడి..

కాంగ్రెస్ ది సోషల్ మీడియా హడావుడే తప్ప క్షేత్ర స్థాయిలో ఏమీ లేదన్నారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని చెప్పారు. కేసీఆర్ హయాంలో పల్లెలు, పట్టణాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. తెలంగాణపై తమకు చచ్చేంత మమకారం ఉందని చెప్పారు కేటీఆర్.


First Published:  25 Nov 2023 2:16 AM GMT
Next Story