Telugu Global
Telangana

తగ్గేది లేదు.. కక్షసాధింపులకు లొంగేది లేదు

లిక్కర్‌ కేసులో కవిత నిందితురాలు కాదని, బాధితురాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్నారు బీఆర్ఎస్ ఎంపీలు.

తగ్గేది లేదు.. కక్షసాధింపులకు లొంగేది లేదు
X

లోక్ సభ ఎన్నికల వేళ తమకు లొంగని పార్టీలపై బీజేపీ రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు బీఆర్ఎస్ ఎంపీలు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ముగ్గురు ఎంపీలు బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళ అని కూడా చూడకుండా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం దురదృష్టకరమని చెప్పారు. శివసేన పార్టీపై కూడా గతంలో బీజేపీ కుట్రలు చేసిందన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కూడా ఇలాగే అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. బీజేపీకి లొంగని రాష్ట్ర ప్రభుత్వాలపై ఈడీ దాడులకు పాల్పడి భయబ్రాంతులకు గురిచేస్తుందన్నారు.

కవితకు సంబంధమేంటి..?

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పాలసీలు చేసుకుంటాయని.. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ మార్పులకు కవితను బాధ్యురాలిని చేయడం సరికాదని అన్నారు బీఆర్ఎస్ ఎంపీలు. కోర్టులో కవితకు న్యాయం జరుగుతుందని, ఆమె కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లిక్కర్‌ కేసులో కవిత నిందితురాలు కాదని, బాధితురాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్నారు బీఆర్ఎస్ ఎంపీలు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసి రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని ఎంపీలు కోరారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, రైతుల కోసం అనేక పథకాలు విజయవంతంగా అమలు చేసిందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్, లోక్ సభ ఎన్నికల్లో కూడా ఫలితాలు అలాగే ఉంటాయని ఊహిస్తోందని.. 100 రోజుల్లో వారి పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థమైందని అన్నారు. కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, లోక్ సభ ఎన్నికల్లో వారు బీఆర్ఎస్ కే మద్దతు ఇస్తారని చెప్పారు ఎంపీలు.

First Published:  22 March 2024 1:54 PM GMT
Next Story