Telugu Global
Telangana

సీఎం క్షమాపణ చెప్పేవరకు అడుగు కూడా కదలం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మోతె శోభన్‌ రెడ్డి సభలోకి నల్ల కండువాలను తీసుకొస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నల్ల కండువాల వేసుకొని రావడానికి వీల్లేదన్నారు.

సీఎం క్షమాపణ చెప్పేవరకు అడుగు కూడా కదలం
X

తెలంగాణ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. మండలి సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. నల్ల కండువాలు వేసుకొచ్చి, కౌన్సిల్‌ పోడియం వద్ద నిరసనకు దిగారు. దీంతో కౌన్సిల్‌ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి సభను 2సార్లు వాయిదావేశారు. ఈ సందర్భంగా సీఎంపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్లు మండలి చైర్మన్‌ తెలిపారు. కానీ, బీఆర్ఎస్‌ సభ్యులు ఆందోళన విరమించలేదు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభా గౌరవ మర్యాదలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు.

సభ మొదటిసారి వాయిదా పడినపుడు బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీలతో మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చలు జరిపారు. కానీ, సభ మళ్లీ మొదలవగానే బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీలు తిరిగి ఆందోళనకు దిగారు. సీఎం వచ్చి క్షమాపణ చెప్పేంతవరకు రాత్రయనా సరే ఇక్కడే ఉంటామన్నారు. దీంతో సభను మరోసారి వాయిదా వేశారు ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

అంతకుముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మోతె శోభన్‌ రెడ్డి సభలోకి నల్ల కండువాలను తీసుకొస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నల్ల కండువాల వేసుకొని రావడానికి వీల్లేదన్నారు. దీంతో ఎమ్మెల్సీలకు, మార్షల్స్‌ మధ్య వాగ్వాదం జరిగింది. నిరసన తెలపడం తమ హక్కు. కావాలంటే సస్పెండ్ చేసుకోవాలంటూ ఎమ్మెల్సీలు భాను ప్రసాద్‌, శోభన్‌ రెడ్డి, తాతా మధు, మహమూద్‌ అలీ సభలోకి వెళ్లిపోయారు. మొత్తానికి మండలిపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

First Published:  9 Feb 2024 10:10 AM GMT
Next Story