Telugu Global
Telangana

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం

తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేల సమావేశం అనంతరం.. నేతలంతా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి బయలుదేరారు. కేసీఆర్ తో వారు సమావేశం అవుతారని తెలుస్తోంది.

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం
X

ఈ రోజు సీఎంను ఎంపిక చేయడానికి కాంగ్రెస్ లేజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఎల్లా హోటల్ లో జరిగింది. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలతో సహా మాజీ మంత్రులు, పలువురు కీలక నేతలు, ఎమ్మెల్సీ కవిత ఈ సమావేశానికి హాజరయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 39 స్థానాలు లభించాయి. కొన్నిచోట్ల స్వల్ప తేడాతో అభ్యర్థులు ఓడిపోయారు. మరికొన్ని చోట్ల ముక్కోణ పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు వెనకపడ్డారు. ఈ ఓటమితో తాము కుంగిపోవట్లేదని.. ప్రతిపక్ష పాత్రను సమర్థంగా నిర్వహిస్తామని చెప్పారు కేటీఆర్. రెండుసార్లు తమకు ప్రజలు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల కోసమే తాము పనిచేస్తామన్నారు.

తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేల సమావేశం అనంతరం.. నేతలంతా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి బయలుదేరారు. కేసీఆర్ తో వారు సమావేశం అవుతారని తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణ.. ప్రతిపక్ష పాత్రలో ఎలా ఉండాలనే విషయంపై కేసీఆర్, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేస్తారని అంటున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడతారని తెలుస్తోంది. ఒకవేళ కేసీఆర్ నేరుగా మీడియా ముందుకు రాకపోయినా.. చర్చల సారాంశాన్ని కీలక నేతలు మీడియాకు తెలియజేస్తారు.

First Published:  4 Dec 2023 9:36 AM GMT
Next Story