Telugu Global
Telangana

ఒట్టేసి చేసి చెబుతున్నా..

అప్పట్లో బండి సంజయ్ కూడా తడిబట్టల ప్రమాణంతో కలకలం రేపారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి తడిబట్టలతో దేవుడి పటం పట్టుకుని ప్రమాణం చేశారు, కాంగ్రెస్ సవాల్ కి సమాధానం చెప్పారు.

ఒట్టేసి చేసి చెబుతున్నా..
X

"పాడి కౌశిక్ రెడ్డి అనే నేను.. నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ మాత్రం అవినీతి చేయలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, ఆ చిల్పూరు హనుమంతుడి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నా.." అంటూ తడిబట్టలతో ఒట్టుపెట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. వీణవంకలోని తన ఇంటిలోనే ఈ ప్రమాణం చేశారు. ఇప్పుడు బంతి మంత్రి పొన్నం ప్రభాకర్ కోర్టులో పడింది. ఆయన కూడా ఇలాగే తడిబట్టలతో ప్రమాణం చేస్తారా అని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.


ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ పై కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్లైయాష్ తరలింపులో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని, లారీల ఓవర్ లోడ్ వ్యవహారంలో కూడా ఆయనే ముద్దాయి అని అన్నారు. ఓవర్ లోడ్ తో వెళ్తున్న లారీ ఓ విద్యార్థిని బలితీసుకుందని, దానికి కూడా పొన్నం బాధ్యుడని ఆరోపించారు. ఒకేళ ఆయన అవినీతి చేయలేదని నిరూపించుకోవాలంటే దేవుడి ముందు ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.

ఈ సవాల్ కి నేరుగా పొన్నం స్పందించలేదు. మధ్యలో మరో కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు తెరపైకి వచ్చారు. అసలు అవినీతిపరుడు పాడి కౌశిక్ రెడ్డి అంటూ ప్రణవ్ బాబు కౌంటర్ ఇచ్చారు. దీంతో కౌశిక్ రెడ్డి మరో సవాల్ కి సిద్ధమయ్యారు. తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, కావాలంటే చిల్పూరు ఆంజనేయ స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానన్నారు. అన్నట్టుగానే ఆయన ఈరోజు చిల్పూరు వెళ్లేందుకు బయలుదేరారు. దీంతో పోలీసులు ముందుగానే కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసినా ఆయన మాత్రం సవాల్ ని వదిలిపెట్టలేదు. తన ఇంట్లోనే తడిబట్టలతో దేవుడి పటం చేతిలో పట్టుకుని ప్రమాణం చేశారు. తానెక్కడా అవినీతికి పాల్పడలేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తనలాగే ప్రమాణం చేసి నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ చేశారు.

ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా గతంలో ఇలాగే సవాల్ చేసి తడిబట్టలతో ప్రమాణం చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగిన ఘటనలో బండి ప్రమేయం ఉందంటూ ఆరోపణలు రాగా.. ఆయన యాదగిరి గుట్టలో ప్రమాణం చేసి మరీ తన ప్రమేం లేదని చెప్పారు. అప్పట్లో ఆయన బీఆర్ఎస్ నేతల్ని కూడా యాదగిరి గుట్ట వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఇలాంటి సవాల్ నే కాంగ్రెస్ నేతల ముందుంచారు. మరి మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ, ఆయన తరపున ఇంకెవరైనా తడిబట్టలతో రెడీ అవుతారేమో చూడాలి.

First Published:  25 Jun 2024 10:51 AM GMT
Next Story