Telugu Global
Telangana

తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్.. డీకేతో మల్లారెడ్డి భేటీ

శుక్రవారం ప్రియాంక గాంధీ అపాయింట్ మెంట్ కూడా కోరినట్టు తెలుస్తోంది. అంటే దాదాపుగా మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయమని తేలిపోయింది.

తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్.. డీకేతో మల్లారెడ్డి భేటీ
X

కేసీఆర్ తోనే ఉంటా, బీఆర్ఎస్ లోనే కొనసాగుతానంటూ ఇటీవల మీడియా ముందు స్పష్టం చేసి తనపై వచ్చిన పుకార్లను ఖండించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. సీన్ కట్ చేస్తే ఈరోజు ఆయన కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. శుక్రవారం ప్రియాంక గాంధీ అపాయింట్ మెంట్ కూడా కోరినట్టు తెలుస్తోంది. అంటే దాదాపుగా మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయమని తేలిపోయింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థలపై దాడులు జరిగాయి. ప్రభుత్వ స్థలాలను, వాగు పోరంబోకుని ఆక్రమించుకుని మల్లారెడ్డి బిల్డింగ్ లు కట్టారని తేలింది. దీంతో వాటిని కూల్చివేసే ప్రయత్నాలు చేశారు అధికారులు. ఆ తర్వాత వెంటనే మల్లారెడ్డి కాంగ్రెస్ నేతలను కలిశారు. దీంతో ఆయన పార్టీ మారిపోతారనే ప్రచారం మొదలైంది. అయితే మల్లారెడ్డి వెంటనే కేసీఆర్ ని కలసి తన విధేయత ప్రకటించుకున్నారు. పార్టీ మారను అని మీడియా ముందు చెప్పారు. కానీ బీఆర్ఎస్ తన కొడుక్కి ఆఫర్ చేసిన లోక్ సభ టికెట్ ని మాత్రం మల్లారెడ్డి వద్దని చెప్పారు.

కాంగ్రెస్ లో చేరాలంటే నేరుగా మల్లారెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిని కలవొచ్చు. కానీ గతంలో రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇక్కడ భేటీకి అడ్డు వచ్చాయి. రేవంత్ రెడ్డిని దాదాపుగా ఎవరూ ఆ స్థాయిలో తిట్టి ఉండరు. ఎన్నికల టైమ్ లో ఓ రేంజ్ లో ఆయన్ను చెడామడా తిట్టారు మల్లారెడ్డి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యాసంస్థల స్థలాల ఆక్రమణల విషయంలో ఆయన ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ గూటికే చేరాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ చేరికను తెలంగాణ పౌర సమాజం ఎలా చూస్తుందనేదే అసలు ప్రశ్న. మల్లారెడ్డిని బెదిరించి కాంగ్రెస్ లోకి తీసుకున్నారనే అపవాదు వస్తుందని ముందూ వెనక ఆలోచిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరాక ఆయన కాలేజీ బిల్డింగ్ ల తొలగింపు ఆగిపోయినా, ఆ విషయం మరుగున పడినా.. అది పొలిటికల్ గేమ్ అనే విషయం స్పష్టమైనట్టే లెక్క.

First Published:  14 March 2024 9:44 AM GMT
Next Story