Telugu Global
Telangana

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
X

మరికొన్ని రోజుల్లో నామినేషన్లు ప్రారంభం కానున్న వేళ.. పటాన్‌చెరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో ఓ కంపెనీపై జరిగిన దాడిలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సంగారెడ్డి కోర్టు రెండున్నర ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, సంగారెడ్డి కోర్టు ఇచ్చిన తీర్పుపై మహిపాల్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సంగారెడ్డి కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. అయితే అడ్వొకేట్ ముఖీం ఈ స్టేను సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును వెంటనే సవాలు చేయకుండా ఆలస్యంగా వచ్చినందుకు ఈ కేసును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఫ్యాక్టరీపై జరిగిన దాడిలో వర్కర్లు, జనరల్ మేనేజర్లు తీవ్రంగా గాయపడ్డారని.. ఆ తర్వాత ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది డిశ్చార్జి అయినట్లు అడ్వొకేట్ ముఖీం తెలిపారు. ఫ్యాక్టరీ యజమాని రాజీ పడ్డారని.. కానీ బాధితుల గోడు వినకుండానే కేసును క్వాష్ చేసినట్లు పేర్కొన్నారు.

దీనిపై మహిపాల్ రెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపించారు. ముఖీం సోదరుడు ప్రత్యర్థి పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నారని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని .. ఎన్నికలకు ఆరు నెలల ముందు కేసు వేశారని తెలిపారు. హైకోర్టు తీర్పు ఇచ్చి ఇప్పటికే 400 రోజులు అయిపోయిందని.. రాజకీయ దురుద్దేశంతోనే పిటిషన్ దాఖలు చేసినట్లు సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకొని వెళ్లారు.హైకోర్టులో అన్ని మెరిట్స్ పరిశీలించిన తర్వాతే క్వాష్ చేసినట్లు తెలిపారు. ఇందులో ప్రజలకు సంబంధం లేదని.. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారమని సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో ముఖీం వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.

First Published:  31 Oct 2023 7:32 AM GMT
Next Story