Telugu Global
Telangana

కేసీఆర్ ని తప్పుబట్టే అర్హత ఉత్తమ్ కి ఉందా..?

కేసీఆర్ కి అవగాహన లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనడం విడ్డూరం అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అసలు కేసీఆర్ ని తప్పుబట్టే అర్హత ఉత్తమ్ కి ఉందా అని ప్రశ్నించారు.

కేసీఆర్ ని తప్పుబట్టే అర్హత ఉత్తమ్ కి ఉందా..?
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకూ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు బీఆర్ఎస్ నేతలు. రైతుల ఆత్మహత్యలన్నీ బూటకం అంటున్న ఉత్తమ్ కు ఆవేశం, అవగాహన లోపం, అనుభవ రాహిత్యం మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాకు, సొంత ఊరికి వచ్చే ప్రాజెక్టు గురించి ఏనాడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్ లో ఉత్తమ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య.


కేసీఆర్ పార్టీ ఉనికి కోసం పాకులాడుతున్నారని, ఆయనకు గోదావరి జలాలపై అవగాహన లేదని కూడా ఉత్తమ్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కి అవగాహన లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనడం విడ్డూరం అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అసలు కేసీఆర్ ని తప్పుబట్టే అర్హత ఆయనకి ఉందా అని ప్రశ్నించారు. రైతుల కోసం కేసీఆర్ రెండు అడుగులు ముందుకు వేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం కరువు వస్తే ఏం చేస్తోందని నిలదీశారు. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బాధ్యత లేకుండా పారిపోయింది ఎవరని ప్రశ్నించారు. సీఎం బిజీగా ఉన్నట్లున్నారని, ఆయనకు క్రికెట్ మ్యాచ్ లకే టైమ్ సరిపోవట్లేదని కౌంటర్ ఇచ్చారు.

మేడిగడ్డ ఆనకట్ట వద్ద సమస్య ఉంటే... అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి నీటిని ఎందుకు ఎత్తిపోయలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. అన్నారం, సుందిళ్లలోని 4 టీఎంసీలు ఎత్తిపోయకుండా కిందకు ఎందుకు వదిలారని నిలదీశారు. తప్పుడు సమాచారంతో నీఛ రాజకీయాలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కిసాన్ న్యాయ్ అంటూ మేనిఫెస్టోలో ఘనంగా ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ హామీని ఏం చేశారని ప్రశ్నించారు. డిసెంబర్ 9 పోయి 120 రోజులు అవుతుంది కదా..? రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదన్నారు. రైతు భరోసా ద్వారా ఎకరానికి రూ.15 వేలు, కౌలు దారులకు ఇస్తానన్న రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు ఇస్తానన్న 12 వేలు ఏమయ్యాయని అడిగారు బీఆర్ఎస్ నేతలు.

First Published:  7 April 2024 1:30 AM GMT
Next Story