Telugu Global
Telangana

మధ్యప్రదేశ్‌లో బీఆర్ఎస్ జోష్.. ప్రముఖ సామాజిక కార్యకర్త ఆనంద్ రాయ్ చేరిక

సమాచార హక్కు చట్టం, గిరిజన హక్కుల పోరాట యోధుడిగా దేశవ్యాప్తంగా ఆనంద్ రాయ్‌కు పేరుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆయనను అభిమాన నాయకుడిగా చూస్తారు.

మధ్యప్రదేశ్‌లో బీఆర్ఎస్ జోష్.. ప్రముఖ సామాజిక కార్యకర్త ఆనంద్ రాయ్ చేరిక
X

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు మహారాష్ట్రలో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌లో కూడా పార్టీ విస్తరణకు నాంది పలికింది. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో పలు రాష్ట్రాల్లో దూసుకొని పోతున్న బీఆర్ఎస్‌కు ఇప్పుడు మరో కీలక వ్యక్తి తోడయ్యారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త ఆనంద్ రాయ్ పార్టీలో చేరారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపమ్ (మెడికల్ కాలేజీ సీట్ల) స్కామ్‌ను బయటపెట్టిన వ్యక్తిగా ఆనంద్ రాయ్ చాలా ఫేమస్. బుధవారం హైదరాబాద్ ప్రగతి భవన్‌లో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సమాచార హక్కు చట్టం, గిరిజన హక్కుల పోరాట యోధుడిగా దేశవ్యాప్తంగా ఆనంద్ రాయ్‌కు పేరుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆయనను అభిమాన నాయకుడిగా చూస్తారు. గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న 'జై ఆదివాసీ యువశక్తి సంఘటన్' అనే హక్కుల వేదిక కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపింది. ఈ సంస్థలో ఆనంద్ రాయ్ కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఆనంద్ రాయ్‌తో పాటు జై ఆదివాసి యువశక్తి సంఘటన్ అధ్యక్షుడు లాల్‌సింగ్ బర్మన్, పంచంభీల్, అశ్విన్ దూబే, కైలాష్ రాణా తదితరులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

తెలంగాణ సంక్షేమ పథకాలు ఆకట్టుకున్నాయి..

తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయని జేఏవైఎస్ ఫౌండర్ విక్రమ్ అచ్చాలియా అన్నారు. సీఎం కేసీఆర్ మానవీయ కోణంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధే లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి, అధ్యక్షుడు సీఎం కేసీఆర్‌కు జై ఆదివాసీ యువశక్తి సంఘటన్ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందనే విశ్వాసం దేశ వ్యాప్తంగా కలుగుతుందని చెప్పారు. అనంతరం తమ ఆత్మగౌరవం, ఐక్యతకు ప్రతీక అయిన జై ఆదివాసీ యువశక్తి సంఘటన్ జెండాను సీఎం కేసీఆర్‌కు కప్పారు.

బీఆర్ఎస్‌లో చేరిన మహారాష్ట్ర సర్పంచ్‌లు..

మహారాష్ట్రలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంతకు ముందు తెలంగాణలో పర్యటించిన సర్పంచ్‌లు.. వ్యవసాయం, తాగు, సాగు నీరు, విద్యుత్, రోడ్లు సహా పలు రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించారు. తెలంగాణలో అమలు అవుతున్న ఆసరా పించన్లు, రైతు బంధు, దళిత బంధు వంటి పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామాల్లో కూడా తెలంగాణ మోడల్ పాలన అమలు కావాలని వారు కోరారు. అనంతరం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కు చెందిన సర్పంచ్‌లు, సామాజిక కార్యకర్తలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశంలో అపారమైన సహజ వనరులు అందుబాటులో ఉన్నాయి. కానీ అందుబాటులో ఉన్న ఆ నీటిని, విద్యుత్‌ను దేశ రైతాంగం కోసం కేంద్రంలోని పాలకులు అందించలేకపోతున్నారు అని మండిపడ్డారు. కేంద్ర పాలకులను నిలదీసేలా ప్రతీ పౌరుడు జాగృతం కావాల్సిన అవసరం ఉన్నదని కేసీఆర్ చెప్పారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో రైతులు, ప్రజలకు కనీస అవసరాలైన తాగు నీరు, సాగు నీరు, విద్యుత్ నేటికీ అందడం పోవడం పాలకుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని అన్నారు. తెలంగాణలో అన్ని రకాల పథకాలు అమలు చేస్తున్నప్పుడు.. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న పాలకులకు చిత్తశుద్ధి లోపం వల్లే ప్రజలకు నష్టం జరుగుతోందని కేసీఆర్ మండిపడ్డారు.

First Published:  8 Jun 2023 1:01 AM GMT
Next Story