Telugu Global
Telangana

జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కీలక మార్పులు

ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని ఎమ్మెల్యేలు తమ స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నంత మాత్రాన బీఆర్‌ఎస్‌ కు వచ్చే నష్టం ఏమీలేదని అంటున్నారు ఆ పార్టీ నేతలు. జంపింగ్ నేతలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వస్తే స్థానికులు నిలదీయాలని, తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కీలక మార్పులు
X

ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ జంప్ అయ్యారు, స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి వెళ్లిపోయారు, తాజాగా భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. మరి ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి..? వెళ్లిపోయిన నాయకులతోపాటు తరలి వెళ్లే స్థానిక నేతలు, కేడర్ ని ఒడిసి పట్టుకోవడం ఎలా..? వారిని బీఆర్ఎస్ లోనే ఉండేట్లు చేయగలరా..? లేక కొత్తవారికి అకాశం ఇస్తారా..? ఈ విషయంలో అధిష్టానం వేచి చూసేందుకు ఇష్టపడటం లేదు. ఆయా స్థానాల్లో వెంటనే కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోంది. నియోజకవర్గంలో కోఆర్డినేషన్ కమిటీలు వేయడంతోపాటు, మండల పార్టీ పదవులు కూడా మార్చేందుకు సిద్ధమైంది.

తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు పార్టీ మార్పుపై కూడా బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ తరపున గెలిచి 115 రోజులు కాకముందే ఆయన కాంగ్రెస్‌లో చేరడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌. ప్రజల తీర్పును తెల్లం వెంకట్రావు అవహేళన చేశారని అన్నారు. తెల్లం శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఎమ్మెల్యేగా అనర్హుడిగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పార్టీ అధినాయకత్వం సూచనల మేరకు హైకోర్టులో పిల్‌ వేస్తామని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్. వెంకట్రావుకి వ్యతిరేకంగా స్థానిక నాయకులంతా సమావేశమయ్యారు. పార్టీ పదవులను వెంటనే మార్చాలంటూ తీర్మానం చేశారు.

ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని ఎమ్మెల్యేలు తమ స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నంత మాత్రాన బీఆర్‌ఎస్‌ కు వచ్చే నష్టం ఏమీలేదని అంటున్నారు ఆ పార్టీ నేతలు. జంపింగ్ నేతలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వస్తే స్థానికులు నిలదీయాలని, తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఇక ఆయా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు మొదలు పెట్టింది. జంపింగ్ నాయకుల అనుచరులను, వారికి సహకరిస్తారనే అనుమానం ఉన్నవారిని దూరం పెట్టి.. పార్టీకోసం పనిచేసే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనుకుంటోంది.

First Published:  8 April 2024 1:56 AM GMT
Next Story