Telugu Global
Telangana

నేటినుంచి బీఆర్ఎస్ భేటీలు మొదలు.. ప్రచారంలో దూకుడు

బీఆర్ఎస్ అభ్యర్థుల కూర్పులో సామాజిక న్యాయం పాటించిందని స్పష్టంగా తెలుస్తోంది. రిజర్వ్‌డ్‌ స్థానాలు కాకుండా మిగతా సీట్లలో సగం బీసీలకే దక్కాయి. ఎస్సీలకు 3, ఎస్టీలకు 2, బీసీలకు 6, ఓసీలకు 6 స్థానాలు కేటాయించారు కేసీఆర్.

నేటినుంచి బీఆర్ఎస్ భేటీలు మొదలు.. ప్రచారంలో దూకుడు
X

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూకుడుమీద ఉంది బీఆర్ఎస్. ప్రచార పర్వంలో కూడా ఆ స్పీడ్ కంటిన్యూ చేయాలని పిలిపునిచ్చారు పార్టీ అధినేత కేసీఆర్. క్షేత్ర స్థాయిలో శ్రేణులను సన్నద్ధం చేయాలని సూచించారు. ఆయన పిలుపు మేరకు ఈరోజు నుంచి లోక్‌సభ స్థానాల పరిధిలో సన్నాహక సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు నేతలు.

నెలాఖరుకు భేటీలు పూర్తి..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు.. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా జరిగే సమావేశాలకు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. ఈ భేటీలకు పార్టీ ఎంపీ అభ్యర్థులు హాజరవుతారు. ఈ నెల 30వ తేదీలోగా ఈ భేటీలను పూర్తిచేయాలని పార్టీ ఆదేశించింది. 30 తర్వాత క్షేత్ర స్థాయిలో ఎంపీ అభ్యర్థులు పర్యటించాలని.. ముఖ్యంగా పంట నష్టం, కరువు పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కేసీఆర్‌ సూచించారు.

ఏప్రిల్ రెండో వారం నుంచి ప్రచారం..

ప్రస్తుతం ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల స్థాయిలో సమన్వయ సమావేశాలు జరుగుతాయి. స్థానికంగా ఉన్న కీలక నేతలు కూడా ఈ సమావేశాలకు హాజరవుతారు. ఇక ఏప్రిల్‌ రెండో వారం నుంచి క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో కనీసం రెండు, మూడు బహిరంగ సభలు నిర్వహిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి పరేడ్‌ గ్రౌండ్స్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు.

అభ్యర్థుల కూర్పు భళా..

బీఆర్ఎస్ అభ్యర్థుల కూర్పులో సామాజిక న్యాయం పాటించిందని స్పష్టంగా తెలుస్తోంది. రిజర్వ్‌డ్‌ స్థానాలు కాకుండా మిగతా సీట్లలో సగం బీసీలకే దక్కాయి. ఎస్సీలకు 3, ఎస్టీలకు 2, బీసీలకు 6, ఓసీలకు 6 స్థానాలు కేటాయించారు కేసీఆర్. అభ్యర్థుల విషయానికొస్తే.. 2019లో బీఆర్ఎస్ 9 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. అందులో ఐదుగురు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. ప్రస్తుతం ముగ్గురు సిట్టింగ్ లతోనే బీఆర్ఎస్ బరిలో దిగుతోంది. కరీంనగర్‌ మినహా మిగతా అన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌ కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపింది.

First Published:  26 March 2024 1:45 AM GMT
Next Story