Telugu Global
Telangana

బీఆర్ఎస్‌వి స్కీములు.. కాంగ్రెస్‌వి స్కాములు : మంత్రి కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ ఒక వైపు స్కామ్‌లకు పాల్పడుతుందని.. కానీ బీఆర్ఎస్ స్కీములు అమలు చేస్తుందని అన్నారు. ఆ ప్రభుత్వం వస్తే నల్లా నీళ్లు కూడా బంద్ అవుతాయి. తాగు నీళ్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మంత్రి అన్నారు.

బీఆర్ఎస్‌వి స్కీములు.. కాంగ్రెస్‌వి స్కాములు : మంత్రి కేటీఆర్
X

బీఆర్ఎస్ పార్టీ అంటే స్కీములు.. కాంగ్రెస్ పార్టీ అంటే స్కాములు, బీఆర్ఎస్ అంటే నీళ్లు.. కాంగ్రెస్ అంటే కన్నీళ్లు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీవి వారెంటీ లేని గ్యారెంటీలు అని.. ప్రస్తుతం ఆ పార్టీ ఐసీయూలో ఉన్నదని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే 24 గంటల కరెంటు పోయి 3 గంటల కరెంట్ రావడం ఖాయమని అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పదేళ్ల ప్రగతి మహాసభలో మంత్రి కేటీఆర్ పాల్గొని, మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ ఒక వైపు స్కామ్‌లకు పాల్పడుతుందని.. కానీ బీఆర్ఎస్ స్కీములు అమలు చేస్తుందని అన్నారు. ఆ ప్రభుత్వం వస్తే నల్లా నీళ్లు కూడా బంద్ అవుతాయి. తాగు నీళ్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మంత్రి అన్నారు. అధికారంలోకి వస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పిన ప్రధాని మోడీ.. ఇప్పటికైనా ఆ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పాలమూరు వస్తున్న మోడీ తప్పకుండా జాతీయ హోదా ప్రకటించాలని కోరారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావల్సిన 575 టీఎంసీలను కేటాయించాలని కోరారు. మోడీకి తెలంగాణ అంటే ఇంత వివక్ష ఎందుకని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వాల్మీకీ బోయలకు ఎస్టీ హోదా ఇవ్వాలని రెండు సార్లు తీర్మానం పంపినా కేంద్ర ఇంత వరకు పట్టించుకోలేదని మండిపడ్డారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటానన్నోళ్లు కూడా మోసం చేశారని అన్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 14 లక్షల మంది వలస పోతుంటే ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలేదు. పక్కనే నది ఉన్నా.. భూములకు నీళ్లివ్వలేదు. ఆర్డీఎస్ తూములు పగులగొట్టి నీళ్లు తీసుకెళ్తున్నా.. ఎవరూ పట్టించుకోలేదు. అక్రమంగా నీళ్లు తీసుకొని పోతుంటే కాంగ్రెస్ నాయకులే హారతులిచ్చారని దుయ్యబట్టారు. కేంద్రంలో మన ప్రమేయం ఉన్న ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్‌కు అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

వనపర్తి నియోజకవర్గానికి నీళ్లు తీసుకొచ్చిన ఘనత మంత్రి నిరంజన్ రెడ్డిదే.. ఆయన ఆశీస్సుల వల్లే ఇది సాధ్యం అయ్యిందని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. వనపర్తికి మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయని చెప్పారు. రూ.180 కోట్లతో కొత్త ఆసుపత్రిని కూడా నిర్మించారు. ఐటీఐ, కేజీబీవీ, వ్యవసాయ కాలేజీ భవనాల నిర్మాణాలు త్వరలోనే పూర్తవుతాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ పునర్మిర్మాణంలో, పాలమూరు అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన మంత్రి నిరంజన్ రెడ్డిని మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు అల వెంకటేశ్వర్ రెడ్డి, వీఎం అబ్రమాం, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్ రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు ఆంజనేయ గౌడ్, వాల్యా నాయక్, రజనీ సాయిచంద్, జడ్పీ చైర్మన్ లోకో‌నాథ్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

First Published:  29 Sep 2023 2:17 PM GMT
Next Story