Telugu Global
Telangana

బోనస్ ని బోగస్ గా మార్చకండి..

కేబినెట్ మీటింగ్ లో రైతు బంధు గురించి చర్చించాలని చెప్పారు బీఆర్ఎస్ నేతలు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యేలా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని కోరారు.

బోనస్ ని బోగస్ గా మార్చకండి..
X

పంట బోనస్ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తప్పులు చేసిందని, బోనస్ ని బోగస్ గా మార్చొద్దని సూచించారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్ష‌త‌న ఈరోజు జ‌రిగే కేబినెట్ స‌మావేశంలో రైతుల ప‌ట్ల సానుకూల నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని కోరారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్, కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.

కేబినెట్ మీటింగ్ లో రైతు బంధు గురించి చర్చించాలని చెప్పారు బీఆర్ఎస్ నేతలు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యేలా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని కోరారు. ప్ర‌ధాని మోదీ స‌హా చాలా మంది నేతలు రైతుబంధు ప‌థ‌కాన్ని స్వాగ‌తించారని, పీఎం కిసాన్ ప‌థ‌కానికి స్ఫూర్తి.. కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబంధు అని పేర్కొన్నారు. పంట కోత‌ల త‌ర్వాత రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం రైతుబంధు ఇచ్చిందని.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ చెబుతున్న రైతు భ‌రోసా అమ‌లు కాలేదని ఆరోపించారు. రైతుభ‌రోసా అమ‌లు చేసి ఎక‌రాకు రూ. 15 వేలు ఇవ్వాలన్నారు. రైతుల ప‌ట్ల సానుకూల నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరుతున్నామని తెలిపారు వినోద్ కుమార్.

వ‌రి పండించిన రైతుల‌కు రూ. 500 బోన‌స్ ఇవ్వాలన్నారు బీఆర్ఎస్ నేతలు. బోన‌స్‌ కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన నిరసనలకు మంచి స్పందన వచ్చిందన్నారు. బోన‌స్, మ‌ద్ద‌తు ధ‌ర విష‌యంలో రేవంత్ రెడ్డి మాట త‌ప్పారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందే బోనస్ పై అసలు విషయం చెప్పి ఉంటే.. కాంగ్రెస్ కి కనీసం డిపాజిట్లు కూడా వచ్చి ఉండేవి కావన్నారు. ప్రస్తుతం అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయిందని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలన్నారు. వ‌రికి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాలని కోరారు. రైతుల మేలు కోరి వారికి మంచి చేసే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు.

First Published:  18 May 2024 8:11 AM GMT
Next Story