Telugu Global
Telangana

గోషా మహల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు

ఇక్కడ ఎంఐఎం వ్యూహాత్మకంగా తమ అభ్యర్థిని బరిలో దింపలేదు. కాంగ్రెస్ తరపున మొగిలి సునీత పోటీ చేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ని ఓడించేందుకు బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

గోషా మహల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు
X

జీహెచ్ఎంసీ పరిధిలో కీలక స్థానం గోషా మహల్ కి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇంకా బోణీ కొట్టలేదు. బీజేపీ తరపున అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ కాస్త బలంగా కనపడుతున్నారు. కానీ ఈసారి ఎలాగైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకోడానికి బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. అందుకే అభ్యర్థిని కూడా చివరి వరకు ప్రకటించలేదు. తాజాగా ఆ స్థానాన్ని నంద కిషోర్ వ్యాస్ బిలాల్‌ కు కేటాయించారు. ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా నంద కిషోర్ బీ ఫామ్‌ అందుకున్నారు.

గోషామహల్‌ నుంచి బీఆర్ఎస్ టికెట్‌ కోసం నలుగురు నేతలు పోటీ పడ్డారు. టికెట్ దక్కించుకున్న నంద కిషోర్‌ బిలాల్‌ తోపాటు, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌ సింగ్ రాథోడ్‌, గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఆశిష్ కుమార్ యాదవ్‌ కూడా ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన పీజేఆర్ తనయుడు విష్ణువర్దన్ రెడ్డి పేరు కూడా ఆశవహుల లిస్ట్ లో వినిపించింది. అయితే చివరకు నంద కిషోర్ బిలాల్ వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. 2014లో నంద కిషోర్ ఇండిపెండెంట్ గా గోషామహల్ నుంచి పోటీ చేసి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ కుమార్ కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. ఈసారి ఆయనే బీఆర్ఎస్ అభ్యర్థి అయ్యారు.

ఇక్కడ ఎంఐఎం వ్యూహాత్మకంగా తమ అభ్యర్థిని బరిలో దింపలేదు. కాంగ్రెస్ తరపున మొగిలి సునీత పోటీ చేస్తున్నారు. వరుసగా రెండుసార్లు ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన రాజాసింగ్ మూడోసారి కూడా బీజేపీ టికెట్ దక్కించుకున్నారు. ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి మరీ టికెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. ప్రస్తుతం గోషా మహల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ చార్జ్ గా ఉన్న నందకిషోర్ వైపే కేసీఆర్ మొగ్గు చూపడం విశేషం.

First Published:  7 Nov 2023 12:01 PM GMT
Next Story