Telugu Global
Telangana

22 ల్యాండ్ క్రూయిజర్లు.. బీఆర్ఎస్‌ ఏమంటోంది..!

రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడుతోంది. ల్యాండ్ క్రూయిజర్ల కొనుగోలులో ఎలాంటి దాపరికం లేదని.. అందుకు సంబంధించిన వార్తలు హిందూ సహా అనేక ప్రముఖ పత్రికల్లోనూ వచ్చాయని, అందుకు సంబంధించిన పేపర్‌ క్లిప్‌లను ట్విట్టర్‌లో పెడుతూ కౌంటర్ ఇస్తోంది.

22 ల్యాండ్ క్రూయిజర్లు.. బీఆర్ఎస్‌ ఏమంటోంది..!
X

తెలంగాణలో ఇప్పుడు 22 ల్యాండ్ క్రూయిజర్ల కొనుగోలు వివాదం హాట్‌ టాపిక్‌గా మారింది. గురువారం ప్రజాపాలన దరఖాస్తు విడుదల సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఖరీదైన 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసి విజయవాడలో దాచిందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకువద్దామని కేసీఆర్ ప్లాన్ చేశారన్నారు రేవంత్ రెడ్డి. కానీ, కేసీఆర్ తల మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయారంటూ కామెంట్ చేశారు.

రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడుతోంది. ల్యాండ్ క్రూయిజర్ల కొనుగోలులో ఎలాంటి దాపరికం లేదని.. అందుకు సంబంధించిన వార్తలు హిందూ సహా అనేక ప్రముఖ పత్రికల్లోనూ వచ్చాయని, అందుకు సంబంధించిన పేపర్‌ క్లిప్‌లను ట్విట్టర్‌లో పెడుతూ కౌంటర్ ఇస్తోంది. ల్యాండ్ క్రూయిజర్లను కొన్న మాట వాస్తవమేనని.. సీఎం భద్రతా దృష్ట్యా వాటికి బుల్లెట్‌ ప్రూఫ్ చేయించేందుకే విజయవాడ సమీపంలోని వీరపనేని గూడెం వర్క్‌షాప్‌కు తరలించినట్లు చెప్తున్నారు. ఇక ల్యాండ్ క్రూయిజర్లను దాచామని రేవంత్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటోంది బీఆర్ఎస్. కార్గొ విమానంలో ఈ ల్యాండ్ క్రూయిజర్లను విజయవాడకు తరలించిన వార్తలు అప్పట్లోనే పేపర్లలో వచ్చాయని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. సీఎం కాన్వాయ్‌లోని వెహికిల్స్ అప్పటికే లక్షా 50 వేల కిలోమీటర్లు తిరిగి ఉండటంతోనే కొత్తవాటికి ఆర్డర్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ప్రముఖుల కాన్వాయ్‌లకు బుల్లెట్‌‌ప్రూఫ్‌ను అమర్చే కంపెనీలు జార్ఖండ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత ఏపీలోని కృష్ణా జిల్లాలోనే ఉన్నట్లు సమాచారం.


రేవంత్ ఇప్పటికైనా అబద్ధాలు మానుకోవాలని.. ముఖ్యమంత్రి పదవికి అవమానం తీసుకురావొద్దన్నారు బీఆర్ఎస్ లీడర్ క్రిశాంక్. 2022లో సీఎం కేసీఆర్‌ కొత్త కాన్వాయ్‌లో భాగంగా ల్యాండ్ క్రూయిజర్లు కొన్నారని చెప్పారు. హిందూలో వచ్చిన వార్తకు సంబంధించిన పేపర్‌ క్లిప్‌ను సైతం క్రిశాంక్ ట్వీట్‌కు యాడ్ చేశారు.

First Published:  28 Dec 2023 5:26 AM GMT
Next Story