Telugu Global
Telangana

రేవంత్ పై బీఆర్ఎస్ ఎదురుదాడి.. హరీష్ ఘాటు వ్యాఖ్యలు

ప్రజల ముందు అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ నేతలు గద్దెనెక్కారని చెప్పారు హరీష్ రావు. అసెంబ్లీలోనూ, ఆదిలాబాద్ లోనూ.. వారు చెప్పినవి అబద్ధాలేనన్నారు.

రేవంత్ పై బీఆర్ఎస్ ఎదురుదాడి.. హరీష్ ఘాటు వ్యాఖ్యలు
X

అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు టార్గెట్ గా రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన శాంతించలేదు. తాజాగా ఇంద్రవెల్లి సభలో కూడా సీఎం వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనికి బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. భద్రాచలం సభలో మాజీ మంత్రి హరీష్ రావు.. సీఎం రేవంత్ కి ఘాటుగా బదులిచ్చారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ రాకపోతే రేవంత్ సీఎం అయ్యేవారా? అని ప్రశ్నించారు. దేశంలోనే అత్యంత సంస్కారహీనమైన సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీ బుద్ది చెప్పాలన్నారు.


తిట్ల పురాణం తప్ప మార్పు ఏముంది..?

ప్రజల ముందు అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ నేతలు గద్దెనెక్కారని చెప్పారు హరీష్ రావు. అసెంబ్లీలోనూ, ఆదిలాబాద్ లోనూ.. వారు చెప్పినవి అబద్ధాలేనన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు 4 మెడికల్ కాలేజీలు ఇచ్చింది బీఆర్ఎస్సేనని, మన్యంను విష జ్వరాలనుంచి కాపాడింది బీఆర్ఎస్సేనని చెప్పారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ నేతలు తిట్ల పురాణం తప్ప తీసుకొచ్చిన మార్పేముందని ప్రశ్నించారు. రాష్ట్రంలో తిరోగమనం మొదలైందన్నారు హరీష్ రావు.

కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయ్యాయని ఆరోపించారు హరీష్ రావు. అందుకే అదానీతో కాంగ్రెస్ పార్టీ ఒప్పందాలు చేసుకుందన్నారు. దాసోజ్ శ్రవణ్, సత్యనారాయణకు సంబంధించి.. ఎమ్మెల్సీ సిఫారసులను తిరస్కరించిన గవర్నర్, కాంగ్రెస్ జాబితాను మాత్రం ఎలా ఆమోదించారని నిలదీశారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలకు అర్థమవుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ ను ఓడించింది బీఆర్ఎస్ అభ్యర్థులేనని గుర్తు చేశారు హరీష్ రావు. తెలంగాణలో సమస్యలు ఒక్కొక్కటే మొదలయ్యాయని ఆటో డ్రైవర్లు ఉపాధి లేక రోడ్డున పడ్డారని చెప్పారు. పెంచిన పెన్షన్ సంగతి దేవుడెరుగు... అసలు పెన్షన్ కూడా ఇవ్వకుండా సీనియర్ సిటిజన్లను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు హరీష్ రావు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యవహారం బట్టబయలు అవుతుందన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినపడాలంటే బీఆర్ఎస్ కే మద్దతు తెలపాలని చెప్పారు.

First Published:  3 Feb 2024 10:27 AM GMT
Next Story