Telugu Global
Telangana

కారును పోలిన ఫ్రీ సింబల్స్‌పై బీఆర్ఎస్ ఆందోళన

కారు లాగే కనిపించే సింబల్స్‌ను ఇతరులకు కేటాయించవద్దని, వాటిని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని బీఆర్ఎస్ అభ్యర్థించినా ఎన్నికల సంఘం మాత్రం పట్టించుకోవడం లేదు.

కారును పోలిన ఫ్రీ సింబల్స్‌పై బీఆర్ఎస్ ఆందోళన
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ వస్తుందనే వార్తల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. జాతీయ, ప్రాంతీయ అధికార పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలకు గుర్తుల విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. అయితే గుర్తించబడిని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మాత్రం ఎన్నికల కమిషన్ సూచించిన ఫ్రీ సింబల్స్ నుంచి ఒక గుర్తును ఎంచుకోవల్సి ఉన్నది. గత కొన్ని ఎన్నికల నుంచి బీఆర్ఎస్ పార్టీ గుర్తైన కారును పోలిన గుర్తులు ఫ్రీ సింబల్స్‌లో ఉంటున్నాయి. కారు లాగే కనిపించే సింబల్స్‌ను ఇతరులకు కేటాయించవద్దని, వాటిని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని బీఆర్ఎస్ అభ్యర్థించినా ఎన్నికల సంఘం మాత్రం పట్టించుకోవడం లేదు.

బీఆర్ఎస్ కారును పోలిన గుర్తులు ఉన్న వారు ఎన్నికల్లో భారీగా లబ్ధి పొందుతున్నారు. ఆయా గుర్తులు ఉన్న అభ్యర్థులు గెలవక పోయినా.. బీఆర్ఎస్ అభ్యర్థికి పడాల్సిన ఓట్లను కొల్లగొడుతున్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల కోసం రిటర్నింగ్ అధికారులకు కొన్ని ఫ్రీ సింబల్స్‌ను పంపించారు. వాటిలో చపాతీ రోలర్, డోలి, కుట్టు మిషన్, సబ్బు డబ్బా, టీవీ, కెమేరా, పడవ, రోడ్డు రోలర్ వంటివి ఉన్నాయి. ఆయా గుర్తులను జాబితా నుంచి తొలగించాలని బీఆర్ఎస్ గతంలోనే కోరింది. అయినా సరే వాటిని అలాగే ఉంచడం ఇప్పుడు బీఆర్ఎస్‌ను ఆందోళనకు గురి చేస్తోంది.

ఇండిపెండెంట్, అన్‌రిజిస్టర్డ్ పార్టీల కోసం 193 ఫ్రీ సింబల్స్‌ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించింది. దీంట్లో బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్న సింబల్స్ కూడా ఉన్నాయి. గతంలో కారును పోలిన రోడ్ రోలర్ గుర్తును యుగ తులసి పార్టీకి కేటాయించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది అది కారు గుర్తు అనుకొని ఓటు వేశారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా యుగ తులసి పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం డ్రా ద్వారా రోడ్ రోలర్ గుర్తును యుగ తులసికి తిరిగి కేటాయించారు. ఆ గుర్తును కేటాయించవద్దని బీఆర్ఎస్ కోరుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో కోర్టుకు వెళ్లైనా సరే ఆ గుర్తును తొలగించే ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.

First Published:  26 Sep 2023 3:12 AM GMT
Next Story