Telugu Global
Telangana

చర్లపల్లిలో డబుల్ బెడ్ రూం.. సీఎం రేవంత్ పై ఈసీకి ఫిర్యాదు

ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేసేలా, బెదిరించేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఆయనపై నిషేధం విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

చర్లపల్లిలో డబుల్ బెడ్ రూం.. సీఎం రేవంత్ పై ఈసీకి ఫిర్యాదు
X

సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజల్ని రెచ్చగొట్టేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పరువుకి భంగం కలిగించేలా, ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎన్నికలు సజావుగా సాగాలంటే సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించాలని వారు ఎన్నికల కమిషన్ ని కోరారు. రేవంత్ రెడ్డి సహా, బీజేపీ, ఆంధ్రజ్యోతి పత్రికపై కూడా చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర డీజీపీకి కూడా తమ ఫిర్యాదు కాపీని అందించారు.

ఈ నెల 6న తుక్కుగూడ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "చర్లపల్లి జైల్లో డబుల్‌ బెడ్‌రూం కట్టిస్తున్నా.. ప్రతిపక్ష నేతల్ని జైలుకు పంపిస్తా"నంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని బీఆర్‌ఎస్‌ పేర్కొంది. ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేసేలా, బెదిరించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా సీఎం రేవంత్ పై నిషేధం విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీపై కూడా చర్యలు తీసుకోవాలంటున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. ఈ నెల 8న తెలంగాణ బీజేపీ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో.. కేసీఆర్‌ సహా ఇతర బీఆర్ఎస్ నేతలను కించపరుస్తూ కొన్ని పోస్టింగ్ లు పెట్టారు. వారి పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించే దురుద్దేశంతోనే ఈ పోస్ట్ లు పెట్టారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆయా పోస్ట్ లను తక్షణమే తొలగించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.

ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ ఆంధ్రజ్యోతి పత్రిక కథనాలిస్తోందని.. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది బీఆర్ఎస్. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసు ఉన్నతాధికారులెవరూ అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదని, కనీసం ప్రెస్‌మీట్‌ కూడా నిర్వహించలేదని గుర్తు చేసింది. కేవలం బీఆర్‌ఎస్‌ ప్రతిష్ఠను దెబ్బతీసి, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధిచేకూర్చే విధంగా ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఆ న్యూస్ పేపర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఈసీకి కంప్లయింట్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు.

First Published:  11 April 2024 12:39 AM GMT
Next Story