Telugu Global
Telangana

దానం నామినేషన్ రిజెక్ట్ అవుతుందా..?

నామినేషన్ల స్క్రూటినీ జరుగుతున్న సందర్భంలో దానం నాగేందర్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

దానం నామినేషన్ రిజెక్ట్ అవుతుందా..?
X

నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడాయన కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం కచ్చితంగా ఆయనపై వేటు పడాల్సిందే. కానీ తుది నిర్ణయం స్పీకర్ ది కాబట్టి, స్పీకర్ నిర్ణయంలో కోర్టులు తలదూర్చలేవు కాబట్టి.. ఇలాంటివన్నీ చెల్లుతున్నాయి. కానీ బీఆర్ఎస్ మాత్రం తమ ప్రయత్నాలను ఆపలేదు. దానం నాగేందర్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఓవైపు స్పీకర్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూనే మరోవైపు ఆయన నామినేషన్ తిరస్కరించాలంటూ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు.

నామినేషన్ల స్క్రూటినీ జరుగుతున్న సందర్భంలో దానం నాగేందర్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి, ఆ పదవికి రాజీనామా చేయకుండానే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేయడం సరికాదనే వాదన వినపడుతోంది. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్ లో చేరి లోక్ సభ బరిలో నిలవడం సమంజసం. కానీ ఆయన బీఆర్ఎస్ బీఫామ్ తో గెలిచిన ఎమ్మెల్యే పదవిలో ఉంటూ, ఇప్పుడు కాంగ్రెస్ బీ ఫామ్ పై సికింద్రాబాద్ లోక్ సభ బరిలో నిలిచారు. ఇది నిబంధనలకు విరుద్ధం అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ మారిన దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని, సికింద్రాబాద్‌ ఎంపీ స్థానానికి ఆయన దాఖలు చేసిన నామినేషన్‌ను రిజెక్ట్‌ చేయాలని, అదే సమయంలో ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి కూడా సస్పెండ్‌ చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

దానం నాగేందర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలు మారినా వారెవరూ నేరుగా ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. కడియం శ్రీహరి కుమార్తె కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కానీ దానం నాగేందర్ మాత్రం ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీనిపై ఇప్పుడు రచ్చ జరుగుతోంది. నాగేందర్ నామినేషన్ రిజెక్ట్ అయితే వ్యవహారం మరింత రంజుగా మారుతుందని అంటున్నారు విశ్లేషకులు.

First Published:  26 April 2024 8:08 AM GMT
Next Story