Telugu Global
Telangana

రేవంత్‌కు సినిమా చూపిస్తం.. మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ

వారం, పది రోజులైనా అక్కడే ఉండి.. కాళేశ్వరం ప్రయోజనాల్ని జనాలకు వివరిస్తామన్నారు. 150 నుంచి 200 మంది బీఆర్‌ఎస్‌ ప్రతినిధులతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రేవంత్‌కు సినిమా చూపిస్తం.. మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ
X

కాళేశ్వరం కేంద్రంగా పొలిటికల్ వార్ మొదలైంది. కొద్దిరోజుల కిందటే కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డను పరిశీలించింది. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. కమీషన్ల కోసమే ప్రాజెక్టును నాణ్యత లేకుండా నిర్మించారని ఆరోపించింది. విచారణ జరుగుతోందని దోషులెవరో తేలుతారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్చి1 నుంచి చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. తెలంగాణ భవన్ వేదికగా చలో మేడిగడ్డపై ప్రకటన చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. BRS ఎమ్మెల్యేలంతా మేడిగడ్డకు వెళ్తన్నట్లు ఆయన చెప్పారు. వారం, పది రోజులైనా అక్కడే ఉండి.. కాళేశ్వరం ప్రయోజనాల్ని జనాలకు వివరిస్తామన్నారు. 150 నుంచి 200 మంది బీఆర్‌ఎస్‌ ప్రతినిధులతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మీడియా ప్రతినిధులు కూడా వచ్చి వాస్తవాలను జనాలకు చూపించాలన్నారు.

విడతలవారీగా కాళేశ్వరం ప్రాజెక్టును సమగ్రంగా సందర్శిస్తామన్నారు కేటీఆర్. "అసలు కాళేశ్వరం అంటే ఏంటీ..? రాష్ట్ర ప్రజలకు ఈ రోజు చెప్పదలచుకున్నాం.. దాంతో పాటు కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్న వారికి సజీవంగా చూపెట్టాలని మేడిగడ్డకు బయలుదేరి వెళ్తున్నాం. కేసీఆర్‌ నల్లగొండ బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు. మీరు వెళ్లడం కాదు.. మేడిగడ్డకు మేం కూడా వెళ్తాం, అన్నారం వెళ్తాం, సుందిళ్ల వెళ్తాం, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేలా సజీవంగా చూపెడతాం అన్నారు. కేసీఆర్ చెప్పినట్లుగానే మార్చి1న మేడిగడ్డకు వెళ్లబోతున్నాం". అని కేటీఆర్ అన్నారు.

"కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదు మూడు బరాజ్‌లు. కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు. కాళేశ్వరం అంటే 141 టీఎంసీల స్టోరేజ్‌ కెపాసిటీ.. 240 టీఎంసీల వినియోగం. వీటన్నింటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు. ‘రూ.లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టు అని ఒక వైపు చెబుతూ.. రూ.లక్షకోట్లు కొట్టుకుపోయిందని ఓవైపు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. 84 పిల్లర్లు ఉంటే.. 3 పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజ్‌ కొట్టుకుపోయిందన్నంట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు". ఆ అసత్యాలను తిప్పికొట్టి, జనాలకు నిజాలను చూపెట్టడమే తమ లక్ష్యమన్నారు కేటీఆర్.

First Published:  27 Feb 2024 11:07 AM GMT
Next Story