Telugu Global
Telangana

ఉత్తర తెలంగాణపై కన్నేసిన ప్రధాన పార్టీలు

2014లో బీఆర్ఎస్‌ తెలంగాణ మొత్తంలో 63 స్థానాలు గెలుచుకోగా.. కేవలం ఉత్తర తెలంగాణలో 30 స్థానాలు గెలుచుకుంది. తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలుండగా.. మెజార్టీ మార్కు 60 స్థానాలుగా ఉంది.

ఉత్తర తెలంగాణపై కన్నేసిన ప్రధాన పార్టీలు
X

ప్రధాన పార్టీలు బీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ ఇప్పుడు ఉత్తర తెలంగాణపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాయి. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఉత్తర తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలను దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసిన బీఆర్ఎస్‌.. కొద్ది నెలల వ్యవధిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గాల్లో బీజేపీ చేతిలో ఓడిపోయింది. ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీలు ఈ ప్రాంతంలో డూ ఆర్ డై పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.

ఇప్పటికే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీ మూడు రోజుల విజయభేరీ బస్సు యాత్ర చేపట్టగా.. అక్టోబర్‌ 3న నిజామాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇక నవంబర్‌ 1 నుంచి 9 మధ్య ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పర్యటించనున్నారు.

2014లో బీఆర్ఎస్‌ తెలంగాణ మొత్తంలో 63 స్థానాలు గెలుచుకోగా.. కేవలం ఉత్తర తెలంగాణలో 30 స్థానాలు గెలుచుకుంది. తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలుండగా.. మెజార్టీ మార్కు 60 స్థానాలుగా ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో బీఆర్ఎస్‌ తక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. ఉత్తరాది జిల్లాల్లో గెలిచిన సీట్లే బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయి. ఇక 2018లోనూ బీఆర్ఎస్ దాదాపు 54 స్థానాలు గెలుచుకుంది.

ఇక కాంగ్రెస్‌ పార్టీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో ఘోర పరాభవాన్ని చవి చూసింది. ఆ ఎన్నికల్లో కేవలం 7 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇక 2018లో11 స్థానాల్లో విజయం సాధించింది. తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు BRSలో చేరారు. దీంతో కాంగ్రెస్‌ ఆయా స్థానాల్లో కొత్త అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక బీజేపీ రెండు ఎన్నికల్లోనూ ఒక్క సీటు గెలవలేదు. ఆ పార్టీ అభ్యర్థులు చాలా మంది డిపాజిట్లు కోల్పోయారు. కానీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కమలం పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధించింది.

తాజాగా నిర్వ‌హించిన ఓ సర్వే.. రాహుల్‌ గాంధీ బస్సు యాత్ర, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, మేడారం జాతరకు జాతీయ హోదా లాంటి హామీలతో కాంగ్రెస్‌ ఉత్తర తెలంగాణల్లో పుంజుకుందని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్‌కు 44 శాతం, బీఆర్‌ఎస్‌కు 41 శాతం, బీజేపీకి 10 శాతం ఓట్లు వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది.

First Published:  24 Oct 2023 1:03 PM GMT
Next Story