Telugu Global
Telangana

బీఆర్ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక షురూ..!

రెండు ప్రధాన పార్టీలు ఎన్నికల కోసం కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా కసరత్తు జ‌రుగుతోంది. ఈ నెలలోనే ఫస్ట్‌ లిస్ట్‌ కూడా విడుదల చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌  అభ్యర్థుల ఎంపిక షురూ..!
X

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని అధికార బీఆర్ఎస్‌ పార్టీ భావిస్తుంటే.. ఈ సారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కాంగ్రెస్‌ ఉంది. దీంతో రెండు పార్టీలు ఇప్పుడు ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. రెండు ప్రధాన పార్టీలు ఎన్నికల కోసం కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా కసరత్తు జ‌రుగుతోంది. ఈ నెలలోనే ఫస్ట్‌ లిస్ట్‌ కూడా విడుదల చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

గులాబీ బాస్‌ కేసీఆర్‌ దాదాపు ఇప్పటికే 87 మంది అభ్యర్థులను ఖరారు చేశారని తెలుస్తోంది. వారం, పది రోజుల్లో ఫస్ట్‌ లిస్ట్‌ విడుదల చేయనున్నారని సమాచారం. మరోవైపు గతంలో జరగిన పొరపాట్లు మరోసారి పునరావృతం కాకుండా హస్తం పార్టీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ సారి ముందుగానే అభ్యర్థులను ఫైనల్‌ చేయనున్నారని సమాచారం. కాంగ్రెస్ సైతం 38 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ఫైనలైజ్ చేసిందని.. ఈ నెలాఖరునా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక రెండు పార్టీలు సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఫైనలైజ్ చేస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ కేసీఆర్ ఒకేసారి 105 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈసారి కూడా అదే పద్ధతిలో అభ్యర్థులను ప్రకటించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12 తర్వాత ఫస్ట్‌ లిస్ట్ విడుదల చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే కొంతమందికి మినహా సిట్టింగ్‌లందరికీ టికెట్ ఇస్తారని కేసీఆర్ ప్రకటించారు. అయితే టికెట్ రానివారు ఎంద‌రుంటార‌నేదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ముందుగానే అభ్యర్థులను నిర్ణయించి ప్రచారంలోకి వెళితే.. కాంగ్రెస్‌ మాత్రం చివరి నిమిషం వరకు అభ్యర్థుల ఎంపికలో తాత్సారం చేసింది. దానివల్లే నష్టం జరిగిందని..ఈ సారి అలాంటి తప్పు జరగకుండా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రంగంలోకి దిగాలని ఆ పార్టీ భావిస్తోంది. ఏకాభిప్రాయం ఉన్న అభ్యర్థుల జాబితాను ఈ నెలాఖరులోగా విడుదల చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 38 నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని.. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఫైనలైజ్ చేసి..ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలనే ఆలోచనలో హస్తం పార్టీ పెద్దలు ఉన్నట్లు సమాచారం.

First Published:  8 Aug 2023 11:25 AM GMT
Next Story