Telugu Global
Telangana

100 రోజుల్లో 100 తప్పులు.. లిస్ట్ విడుదల చేసిన బీఆర్ఎస్

మొత్తం 100 ప్రశ్నలతో కాంగ్రెస్ ని ఉక్కిరిబిక్కిరి చేసింది బీఆర్ఎస్. కేటీఆర్ రీట్వీట్ చేయగా.. ఈ 100 ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారాయి.

100 రోజుల్లో 100 తప్పులు.. లిస్ట్ విడుదల చేసిన బీఆర్ఎస్
X

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ 100 రోజుల పాలన హాట్ టాపిక్ గా ఉంది. 100 రోజుల పాలనలో తాము అభివృద్ధి అంటే ఏంటో చూపించామని కాంగ్రెస్ చెబుతుండగా.. కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రంలో తిరిగి కల్లోలం మొదలైందని బీఆర్ఎస్ మండిపడుతోంది. కాంగ్రెస్ చెప్పుకుంటున్న గొప్పలు, బీఆర్ఎస్ చెబుతున్న తిప్పలు.. పోటాపోటీగా సోషల్ మీడియాని ఆక్రమించేశాయి. ఈ దశలో కాంగ్రెస్ 100 తప్పులు అంటూ బీఆర్ఎస్ మరో లిస్ట్ విడుదల చేసింది. వంద రోజుల్లో వంద తప్పులు.. పదేళ్ల తర్వాత రైతులకు తిప్పలు.. అంటూ బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఖాతానుంచి ట్వీట్ చేయగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీట్వీట్ చేస్తూ దాన్ని హైలైట్ చేశారు.


100 ప్రశ్నలు..

100 రోజుల పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టిందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆరు గ్యారెంటీలను అరకొరగా అమలు చేసి, కాంగ్రెస్ పాలకులు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. చేయాల్సిన పనుల్ని పక్కనపెట్టారని, కాంగ్రెస్ కి ధైర్యముంటే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.

రుణ మాఫీతో మొదలు పెట్టి మొత్తం 100 ప్రశ్నలు సంధించారు బీఆర్ఎస్ నేతలు. రైతు భరోసా సాయం ఎందుకు పెంచలేదని, రైతుబంధును సీరియల్‌ లాగా ఎంతకాలం సాగదీస్తారని, వరి పంటకు ఇస్తామన్న రూ.500 బోనస్ ఏమైందని సూటిగా ప్రశ్నించారు. పెన్షన్ల పెంపు ఎందుకు జరగలేదని, మహిళలకు ఇస్తామన్న రూ.2500 హామీ ఏమైందన్నారు. దళితబంధు పథకం అర్థాంతరంగా ఆపేశారని, అంబేద్కర్ అభయహస్తం పథకం అడ్రస్ లేకుండాపోయిందని.. వీటన్నిటికీ కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. ఒక్కరోజు ప్రజా భవన్ కు వెళ్లి ఆ తర్వాత మొహం చాటేశారని, మేడిగడ్డ బ్యారేజీపై కుట్ర చేశారని, పంట చేతికొచ్చే సమయంలో రైతులకు సాగునీళ్లివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.

మొత్తం 100 ప్రశ్నలతో కాంగ్రెస్ ని ఉక్కిరిబిక్కిరి చేసింది బీఆర్ఎస్. కేటీఆర్ రీట్వీట్ చేయగా.. ఈ 100 ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. మరి వీటికి కాంగ్రెస్ సమాధానం చెబుతుందా..? లేక యధావిధిగా విపక్షాలను వెటకారమాడుతుందా..? వేచి చూడాలి.

First Published:  17 March 2024 2:12 PM GMT
Next Story