Telugu Global
Telangana

గుండెపోటుతో అన్న మృతి.. అదే చేతికి రాఖీ కట్టిన చెల్లి

ప్రతి ఏడాదీ రాఖీ కట్టినట్టే ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయం కొనసాగించింది గౌరమ్మ. కానీ ఆమెను దీవించడానికి ఆ చేయి పైకి లేవలేదు, అక్షింతలు వేయలేదు, ఆప్యాయంగా దగ్గరకు తీసుకోలేదు. ఇదే వారిద్దరికి ఆఖరి రాఖీ పండగగా మిగిలిపోయింది.

గుండెపోటుతో అన్న మృతి.. అదే చేతికి రాఖీ కట్టిన చెల్లి
X

రాఖీ పండగ రోజు జరిగిన ఘటన తెలంగాణ పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. రాఖీ పండగ రోజున అన్నకి రాఖీ కట్టేందుకు ఉత్సాహంగా వచ్చిన చెల్లికి అక్కడ కనిపించిన దృశ్యం గుండె పగిలేలా చేసింది. కళ్లముందు ఉన్న అన్న మృతదేహాన్ని చూసి ఆమె షాక్ కి గురైంది. రాఖీ పండగ రోజున అన్న కుటుంబంతో కలసి ఉందామని వచ్చిన ఆమెలో ఆ వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే కడసారి అన్నయ్యకు ఆమె రాఖీ కట్టింది. అచేతనంగా పడి ఉన్న అన్న చేతికి రాఖీ కట్టి తన రుణం తీర్చుకుంది చెల్లెలు.

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్టకు చెందిన కనకయ్య, గౌరమ్మ అన్నా చెల్లెళ్లు. అన్న చెల్లెలు ఎంతో అభిమానంగా ఉండేవారు. వివాహం తర్వాత గౌరమ్మ అత్తవారింటికి వెళ్లింది. పండగలకు పుట్టింటికి వచ్చే గౌరమ్మ, రాఖీ పండగని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరచిపోదు. ఆ రోజు కచ్చితంగా అన్న ఇంటికి వచ్చి రాఖీ కట్టి వెళ్లేది గౌరమ్మ. ఈ ఏడాది కూడా ఆమె అన్నకోసం ఇంటికి వచ్చింది. కానీ అప్పటికే అన్న అచేతనంగా పడి ఉన్నాడు. చెల్లెలు వచ్చే కొన్ని క్షణాల ముందే కనకయ్య గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని ఇంటి బయటకు తీసుకొచ్చి పెట్టారు కుటుంబ సభ్యులు. అంతలోనే చెల్లెలు గౌరమ్మ అక్కడికి వచ్చింది. అన్న మృతదేహాన్ని చూసి గుండె పగిలేలా రోదించింది. అన్నకోసం తెచ్చిన రాఖీని కుటుంబ సభ్యులకు చూపించి కన్నీరు పెట్టుకుంది.

చివరి రాఖీ..

అంత దుఃఖంలోనూ కడసారిగా అన్న మృతదేహానికి చెల్లెలు గౌరమ్మ రాఖీ కట్టి సాగనంపింది. ఆ సన్నివేశం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ కంటతడి పెట్టించింది. ప్రతి ఏడాదీ రాఖీ కట్టినట్టే ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయం కొనసాగించింది గౌరమ్మ. కానీ ఆమెను దీవించడానికి ఆ చేయి పైకి లేవలేదు, అక్షింతలు వేయలేదు, ఆప్యాయంగా దగ్గరకు తీసుకోలేదు. ఇదే వారిద్దరికి ఆఖరి రాఖీ పండగగా మిగిలిపోయింది.


First Published:  30 Aug 2023 8:22 AM GMT
Next Story