Telugu Global
Telangana

కేసీఆర్ జాతీయ పార్టీకి బ్రదర్ అనిల్ కుమార్ మద్దతు?

కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీ మోడీ ప్రభుత్వంపై పోరాడటానికే అని ఇప్పటికే తేల్చేశారు. ఇలాంటి సమయంలో బ్రదర్ అనిల్.. కేసీఆర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ జాతీయ పార్టీకి బ్రదర్ అనిల్ కుమార్ మద్దతు?
X

ఇప్పుడు చర్చంతా కేసీఆర్ జాతీయ పార్టీపైనే. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల అయినా.. రాజకీయ చర్చల్లో మాత్రం కేసీఆర్ పార్టీ గురించే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. అసలు పార్టీ పేరు, దాని స్వరూపం, ఎలా ముందుకు తీసుకెళ్తారనే విషయంపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇక జాతీయ పార్టీ అన్న తర్వాత ప్రతీ రాష్ట్రంలోనూ కమిటీలు ఏర్పాటు చేయాలి. మరి అందుకు ఎవరిని ఎంపిక చేస్తారనేది కూడా సస్పెన్స్ గానే ఉంది. తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న జాతీయ పార్టీకి బ్రదర్ అనిల్ కుమార్ మద్దతు ఉంటుందని తెలుస్తోంది. గత కొంత కాలంగా బ్రదర్ అనిల్, ఆయన బామ్మర్థి సీఎం జగన్ మోహన్ రెడ్డికి మధ్య సంబంధాలు అంతగా బాగాలేవు. మరోవైపు వైసీపీ పూర్తిగా బీజేపీకి మిత్ర పక్షంలా మారిపోయింది. కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీ మోడీ ప్రభుత్వంపై పోరాడటానికే అని ఇప్పటికే తేల్చేశారు. ఇలాంటి సమయంలో బ్రదర్ అనిల్.. కేసీఆర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్ సీఎం కావడం వెనుక బ్రదర్ అనిల్ మద్దతు కూడా ఉంది. ఏపీలోని క్రైస్తవ సంఘాలు, బ్రాహ్మణులను జగన్ వైపు తిప్పడంలో అనిల్ కీలక పాత్ర పోషించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పనైనా తాను చేసి పెడతానని.. జగన్‌ గెలుపునకు కృషి చేయాలని కోరారు. అనిల్ కారణంగానే కొన్ని వర్గాల ఓట్లు వైసీపీకి పడ్డాయి. అయితే, ఎన్నికల ముందు అనిల్ ఇచ్చిన వాగ్దానాలు ఏవీ నెరవేరలేదు. సీఎం జగన్ వద్ద ఈ విషయం ప్రస్తావించినా ఆయన లైట్ తీసుకున్నట్లు తెలిసింది. అందుకే ఏపీలోని క్రైస్తవ సంఘాలకు చాలా అన్యాయం జరిగిందని, అందరం కలసి ఒక పార్టీ పెట్టుకుందామని గతంలో వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగానే ఈ పార్టీ పెట్టాలని పిలుపునిచ్చారు. కానీ అది అంత సులభమైన విషయం కాదని అనిల్‌కు త్వరగానే తెలిసింది.

మరోవైపు వైఎస్ జగన్ సోదరి, అనిల్ భార్య వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రతినిత్యం కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ టార్గెట్‌గా వ్యాఖ్యలు చేస్తున్నారు. మోడీ కంటే ఎక్కువగా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు. అయితే దీని వల్ల పెద్దగా లాభం లేదని అనిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా పార్టీని బలోపేతం చేయవచ్చని షర్మిలకు సూచించినట్లు సమాచారం. ఆ విషయంపై ఇంకా షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలోని క్రైస్తవ సంఘాలతో బ్రదర్ అనిల్ కుమార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన మాటకు విలువిచ్చే క్రైస్తవులు కూడా భారీగా ఉన్నారు. ఒకవేళ అనిల్ కనుక కేసీఆర్ జాతీయ పార్టీకి మద్దతు ఇస్తే అది తప్పకుండా కలసి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక ఏపీలోని క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ (సీవైఎఫ్) ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కేసీఆర్ జాతీయ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీవైఎఫ్‌కు ఏపీలో అనేక మంది క్రిస్టియన్ యూత్ సభ్యులు ఉన్నారు. క్షేత్ర స్థాయిలో వీళ్లు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీళ్లు ఇప్పుడు కేసీఆర్ పార్టీకి మద్దతు ఇస్తూ తీర్మానం చేయడం గమనార్హం. ఆ తీర్మాన పత్రాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రావుకు అందజేశారు.

First Published:  4 Oct 2022 9:21 AM GMT
Next Story