Telugu Global
Telangana

రాయదుర్గం-శంషాబాద్ మెట్రో రూట్‌కు బ్రేకులు..!

ఔటర్ రింగ్‌ రోడ్‌ వెంట గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో మార్గంపై సీఎం సందేహాలు లేవనెత్తినట్లు సమాచారం. కొత్తమంది రియల్టర్లకు మేలు చేసేలా ప్లాన్ చేశారన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

రాయదుర్గం-శంషాబాద్ మెట్రో రూట్‌కు బ్రేకులు..!
X

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రోను అనుసంధించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం-శంషాబాద్‌ ప్లాన్‌కు బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి బదులుగా ఓల్డ్‌ సిటీని అనుసంధానిస్తూ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మెట్రోను విస్తరించే ప్లాన్‌లో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

JBS-ఫలక్‌నుమా కారిడార్‌ పూర్తి చేసి పహాడీ షరీఫ్‌ మీదుగా ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరించే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు లక్డీకపూల్‌, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య మరో లైన్‌ నిర్మించే అవకాశాలున్నాయి. ఈ ప్లాన్‌లో ఓల్డ్‌ సిటీలోని మెజార్టీ ప్రాంతాలతో పాటు టెక్‌ కారిడార్‌లోని పలు ప్రాంతాలను కవర్ చేసే అవకాశం ఉంటుంది.

ఈ మేరకు మంగళవారం హింట్స్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మజ్లిస్ ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆయన హైదరాబాద్‌ అభివృద్ధిపై వారితో చర్చించారు. ఐటీ కారిడార్‌, శంషాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు, వారి బంధువులకు ఎక్కువగా ఏ రూట్‌ ఉపయోగపడుతుందో చూడాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.

ఔటర్ రింగ్‌ రోడ్‌ వెంట గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో మార్గంపై సీఎం సందేహాలు లేవనెత్తినట్లు సమాచారం. కొత్తమంది రియల్టర్లకు మేలు చేసేలా ప్లాన్ చేశారన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేట్ విధానంలో నిర్మించేందుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రూ.7 వేల కోట్లు ప్రాజెక్టు కోసం టెండర్లు పిలవగా.. ఎల్‌ అండ్‌ టీ కాంట్రాక్టును దక్కించుకుంది.

First Published:  13 Dec 2023 3:07 AM GMT
Next Story