Telugu Global
Telangana

బీఆరెస్ ఆత్మీయ సమ్మేళనం పక్కనే పేలుడు, ముగ్గురు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు

పలువురు పార్టీ నేతల కు ఆహ్వానం పలుకుతూ కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. ప్రమాదవశాత్తు బాణసంచా నిప్పురవ్వలు పక్కనే ఉన్న గుడిసెపై పడి మంటల చెలరేగాయి. దాంతో అక్కడున్న కార్యకర్తలు, పోలీసులు ఆ మంటలను ఆర్పేద్దామని ప్రయత్నం చేశారు. ఇంతలో పెద్ద శబ్ధంతో గుడిసె పేలిపోయింది.

బీఆరెస్ ఆత్మీయ సమ్మేళనం పక్కనే పేలుడు, ముగ్గురు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు
X

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం రక్తసిక్తమయ్యింది. కొందరి కాళ్ళు తెగి దూరంగా పడిపోయాయి. అక్కడికక్కడే ఇద్దరు మరణించారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనపడుతోంది. చనిపోయిన వారిని రమేష్, మంగు, సందీప్ గా గుర్తించారు.


బీఆరెస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఆ సమావేశానికి వచ్చిన ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములుతో పాటు పలువురు పార్టీ నేతల కు ఆహ్వానం పలుకుతూ కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. ప్రమాదవశాత్తు బాణసంచా నిప్పురవ్వలు పక్కనే ఉన్న గుడిసెపై పడి మంటల చెలరేగాయి. దాంతో అక్కడున్న కార్యకర్తలు, పోలీసులు ఆ మంటలను ఆర్పేద్దామని ప్రయత్నం చేశారు. ఇంతలో పెద్ద శబ్ధంతో గుడిసె పేలిపోయింది. ఆ పేలుడు గుడిసెలో ఉన్న గ్యాస్ సిలండర్ వల్లనేనా లేక మరింకేమైనా కారణాలున్నాయా అనేది తెలియరాలేదు.

ఆ పేలుడుతో చుట్టుపక్కల వాళ్ళు దూరంగా ఎగిరిపడ్డారు. అనేక మంది కాళ్ళు తెగిపోయాయి. అందులో పోలీసులు కూడా ఉన్నారు. ఇద్దరు అక్కడిక్కడే మరణించగా 10 మందికిపైగా క్షతగాత్రులను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.

ప్రస్తుతం ఘటనా స్థలంలో స్థానికులు, పోలీసులు మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

కాగా, ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్‌ పరామర్శించారు. వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏంపి నామా నాగేశవర రావు మాట్లాడుతూ, ఈ సంఘటనకు బీఆరెస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్న చోటుకి 200 మీటర్ల దూరంలో ఒక సిలిండర్ పేలిందని, పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి వెళ్లడంతో గాయపడ్డారని చెప్పారు. ఆ సమయంలో తాము స్టేజి మీద ఉన్నామని తెలిపారు.ఇద్దరు ముగ్గురికి కాళ్లు తెగినట్టుగా చెప్పారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు.

ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

First Published:  12 April 2023 8:49 AM GMT
Next Story