Telugu Global
Telangana

మునుగోడు విషయంలో బీజేపీ రాంగ్ స్టెప్..

కాంగ్రెస్ కేడర్ కూడా బీజేపీలో చేరడం కంటే అధికార టీఆర్ఎస్ వైపే ఎక్కువ మొగ్గు చూపడం విశేషం. అంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా టీఆర్ఎస్ కి పరోక్షంగా ఉపకారం చేసిందనమాట.

మునుగోడు విషయంలో బీజేపీ రాంగ్ స్టెప్..
X

ఇతర పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాతే తమ పార్టీలో చేరాలనే రూల్ బీజేపీలో లేదు. ఇతర రాష్ట్రాల్లో అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనేసిన బీజేపీ ఎక్కడా ఉప ఎన్నికలకు వెళ్లలేదు. కానీ తెలంగాణలో ఆ అవకాశం దొరకడం వల్లే ఉప ఎన్నికలతో సవాల్ విసురుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో వచ్చిన ఫలితమే మునుగోడులో కూడా వస్తుందని ఆశించి రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించింది. అటు రాజగోపాల్ రెడ్డికి కూడా రాజీనామా అనేది ఒక అవకాశంలా మారింది. తన నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, తన రాజీనామాతోనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని పదే పదే ప్రచారం చేసుకుని చివరకు రాజీనామా చేశారు రాజగోపాల్ రెడ్డి. బీజేపీలో చేరి పునీతుడైపోయినట్టు తిరిగి పోటీ చేస్తున్నారు. కానీ ఈ ఉప ఎన్నిక విషయంలో బీజేపీ పూర్తిగా రాంగ్ స్టెట్ వేసినట్టయింది.

ఉప ఎన్నికతో టీఆర్ఎస్ హడావిడి పడిపోతుందని, వెంటనే అధికార యంత్రాంగం అంతా మునుగోడుకి వచ్చేస్తుందని ఎక్కడలేని హామీలు ఇచ్చేస్తుందని ఆశించారు రాజగోపాల్ రెడ్డి. కానీ అలాంటి అనూహ్య స్పందనలేవీ టీఆర్ఎస్ నుంచి రాలేదు. దీంతో రాజగోపాల్ రెడ్డి ప్లాన్ ఫెయిలైనట్టయింది. ఇక ప్లాన్-బి కాంగ్రెస్ నుంచి వలసలు. అది కూడా పూర్తిగా ఫెయిలైంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తాను ఏమీ చేయలేకపోయాననేది రాజగోపాల్ రెడ్డి వాదన. కాంగ్రెస్ నుంచి ఆయన బీజేపీలోకి వెళ్లినా గెలిస్తే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కావాల్సిందే. అంటే ఆయనకు ఓటు వేసి మళ్లీ గెలిపించుకున్నా అప్పటికి, ఇప్పటికీ మార్పేమీ ఉండదు. సో సాధారణ ప్రజానీకం రాజగోపాల్ రెడ్డిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనుకోవట్లేదు. ఇక కాంగ్రెస్ కేడర్ కూడా బీజేపీలో చేరడం కంటే అధికార టీఆర్ఎస్ వైపే ఎక్కువ మొగ్గు చూపడం విశేషం. అంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా టీఆర్ఎస్ కి పరోక్షంగా ఉపకారం చేసిందనమాట.

అసెంబ్లీ ఎన్నికల ముందు రిస్క్..

మునుగోడు ఫలితం తేడా కొడితే కచ్చితంగా దాని ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుంది. అంటే ఇప్పుడు బీజేపీ పూర్తిగా రిస్క్ చేసిందనే చెప్పాలి. ఈ రిస్క్ వల్ల అదనంగా వచ్చే లాభమేదీ ఉండదు. ఓడిపోతే అధికార దుర్వినియోగం అని సాకు చెప్పొచ్చు కానీ వచ్చే ఎన్నికల్లో అది బీజేపీ నైతిక బలాన్ని దెబ్బతీస్తుంది. ఇప్పటి వరకూ జరిగిన ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుచుకున్న సీట్లతో పెరిగిన బలం కాస్తా మునుగోడు ఫలితంతో మరుగునపడిపోతుందనే చెప్పాలి. సో ఉప ఎన్నికకు ముందు జరుగుతున్న ఈ పరిణామాలన్నీ మునుగోడులో బీజేపీ రాంగ్ స్టెప్ వేసినట్టు రుజువు చేస్తున్నాయి.

First Published:  25 Sep 2022 2:36 AM GMT
Next Story