Telugu Global
Telangana

బీజేపీ టార్గెట్ నల్గొండ జిల్లానే.. మరో ఉప ఎన్నికకు ప్లాన్?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిగాయని, ఆయన బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉన్నారని తెలుస్తుంది.

బీజేపీ టార్గెట్ నల్గొండ జిల్లానే.. మరో ఉప ఎన్నికకు ప్లాన్?
X

బీజేపీ టార్గెట్ అంతా ఇప్పుడు తెలంగాణలో అధికారం దక్కించుకోవడంపైనే ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత టీఆర్ఎస్ తప్ప మరో పార్టీకి ఇక్కడ చోటు లేకుండా పోయింది. 2014 కంటే 2018లో టీఆర్ఎస్ బలపడింది. ఎంత వేగంగా రాజకీయ శక్తిగా ఎదిగిందో.. అంతే త్వ‌ర‌గా టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని బీజేపీ జాతీయ నాయకత్వం గుర్తించింది. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలంటే కేవలం హైదరాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బలపడితే సరిపోదని ఇప్పటికే అర్థం అయ్యింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సత్తా చాటితేనే అధికారానికి చేరువవుతామని గుర్తించింది. ఈ క్రమంలో ముందుగా నల్గొండ జిల్లాపై ఫోకస్ పెట్టింది.

హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నికను తీసుకొని రావడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. అయితే అక్కడ బీజేపీ గెలిచినా.. టీఆర్ఎస్‌పై పై చేయి సాధించలేమని గ్రహించింది. అది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో అధికార టీఆర్ఎస్ ఓటమి చెందిందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే వీలు లేకుండా పోతుంది. అందుకే ఉమ్మడి నల్గొండ జిల్లాలలోని ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకొని రావాలని భావిస్తోంది. అంతే కాకుండా ఆయనతో రాజీనామా చేయించి.. మరో ఉపఎన్నిక వచ్చేలా ప్లాన్ చేస్తోంది. అక్కడ కనుక బీజేపీ విజయం సాధిస్తే కాంగ్రెస్ కంచుకోటైన నల్గొండలో పాగా వేయడమే కాకుండా, అధికార టీఆర్ఎస్‌పై పై చేయి సాధించినట్లు అవుతుందని అంచనా వేస్తోంది.

దక్షిణ తెలంగాణలో ఇప్పటి వరకు బీజేపీకి ఒక్క సీటు కూడా లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పలు నియోజకవర్గాల్లో మూడు లేదా అంతకంటే తక్కువ స్థానాల్లోనే నిలిచింది. అందుకే 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే దక్షిణ తెలంగాణలో బీజేపీ తమ ఉనికిని చాటుకోవాలని భావిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిగాయని, ఆయన బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఆయన రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నా.. మునుగోడు ఉపఎన్నిక అనంతరం ఆయనతో రాజీనామా చేయించాలని బీజేపీ స్కెచ్ గీసింది. మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోయినా.. మరో ఉపఎన్నిక తీసుకొని వచ్చి గెలవాలని బీజేపీ ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాగా వేయడం ద్వారా ఖమ్మం, వరంగల్ జిల్లాలపై కూడా ప్రభావం ఉంటుందని, అంతిమంగా అది బీజేపీకి లబ్ది చేకూరుస్తుందని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. గతంలో హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు వచ్చినా బీజేపీ అభ్యర్థులు సరైన పోటీ ఇవ్వలేకపోయారు. దీంతో దక్షిణ తెలంగాణలో బీజేపీ గెలవలేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూడా అదే మైండ్ సెట్‌తో ఉన్నారని గ్రహించింది. అందుకే అసెంబ్లీ ఎన్నికల రాకముందే ఉపఎన్నికలు తీసుకొచ్చి.. వాటిలో గెలవడం ద్వారా బీజేపీ తమ ఉనికిని చాటుకోవాలని భావిస్తోంది. నల్గొండ జిల్లాలో గెలవడం ద్వారా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెక్ పెట్టే అవకాశం ఉందని నాయకత్వం అనుకుంటోంది. అందుకే బీజేపీ మరో ఉపఎన్నికకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

First Published:  18 Aug 2022 4:37 AM GMT
Next Story