Telugu Global
Telangana

నాలుగు రోజుల్లో బీజేపీ తొలి జాబితా.. వారం రోజుల్లో మేనిఫెస్టో

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఎన్నికల ఇన్‌చార్జ్ ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్‌లు అభ్యర్థుల ఎంపిక విషయంలో తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

నాలుగు రోజుల్లో బీజేపీ తొలి జాబితా.. వారం రోజుల్లో మేనిఫెస్టో
X

తెలంగాణలో అధికారంలోకి రావడానికి చాలా ప్రయత్నించిన బీజేపీకి.. అభ్యర్థుల దరఖాస్తులతోనే దిమ్మతిరిగింది. 119 నియోజకవర్గాల్లో పోటీకి దిగడానికి సరైన అభ్యర్థులే లేరనే విషయం స్పష్టమైంది. దీంతో కనీసం గౌరవ ప్రదమైన సంఖ్యలో అయినా ఎమ్మెల్యే స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిని వడపోసే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఈ నెల 16లోగా 70 స్థానాలతో కూడిన తొలి జాబితాను ప్రకటించడానికి అధిష్టానం నిర్ణయం తీసుకున్నది.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఎన్నికల ఇన్‌చార్జ్ ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్‌లు అభ్యర్థుల ఎంపిక విషయంలో తీవ్ర కసరత్తు చేస్తున్నారు. 70 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఆయా స్థానాల్లో ప్రజా ప్రతినిధులు, మాజీలు, గత ఎన్నికల్లో పోటీకి దిగిన వారినే ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇటీవల కొత్తగా పార్టీలో చేరిన వారిలో బలమైన నాయకులకు కూడా తొలి జాబితాలో చోటు దక్కే అవకాశం ఉన్నది.

భారీగా దరఖాస్తులు వచ్చిన దగ్గర ఇద్దరు లేదా ముగ్గురు ఆశావహులను గుర్తించి అధిష్టానానికి పంపారు. ఢిల్లీలో ఫైనల్ అయిన తర్వాత జాబితాను సిద్ధం చేయనున్నారు. ఇక ఎక్కడైనా ఇద్దరు బలమైన అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉంటే.. ఒకరిని బుజ్జగించి పోటీ నుంచి తప్పించడమో లేదంటే ప్రత్యామ్నాయ నియోజకవర్గాన్ని కేటాయించడమే చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇకవైపు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేస్తూనే.. మేనిఫెస్టోపై కూడా కసరత్తు చేస్తున్నారు. మాజీ ఎంపీ జి. వివేక్ నేతృత్వంలోని కమిటీ మేనిఫెస్టోపై ఇప్పటికే పలు సూచనలు చేసినట్లు తెలుస్తున్నది. ఈ నెల 13న మరోసారి ఈ కమిటీ భేటీ అయి.. తుది అంచనాలను అధిష్టానానికి పంపుతుంది. మరో వారం రోజుల్లోనే బీజేపీ మేనిఫెస్టో బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

First Published:  12 Oct 2023 2:36 AM GMT
Next Story