Telugu Global
Telangana

భారీగా పెరుగుతున్న బీజేపీ ఆస్తులు.. అప్పులతో సతమతం అవుతున్న కాంగ్రెస్

జాతీయ రాజకీయ పార్టీల ఆస్తులు, అప్పులపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

భారీగా పెరుగుతున్న బీజేపీ ఆస్తులు.. అప్పులతో సతమతం అవుతున్న కాంగ్రెస్
X

దేశంలోని జాతీయ పార్టీలు తమ ఆస్తులను భారీగా పెంచుకుంటున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22లో జాతీయ పార్టీల ఆస్తులు 21 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆస్తులు భారీగా కూడబెట్టినట్లు స్పష్టమైంది. జాతీయ రాజకీయ పార్టీల ఆస్తులు, అప్పులపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

దేశంలోని ఎనిమిది రాజకీయ పార్టీలకు సంబంధించిన వివరాలు క్రోఢీకరించి ఈ నివేదిక రూపొందించారు. బీజేపీ, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ పార్టీలకు సంబంధించిన వివరాలను ఏడీఆర్ వెల్లడించింది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.4,990 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు బీజేపీ ప్రకటించింది. అయితే 2021-22లో ఆ పార్టీ ఆస్తులు 21.17 శాతం మేర పెరిగి రూ.6,046.81కి చేరాయి. దేశంలోని మరే జాతీయ పార్టీ కూడా ఇంత భారీగా ఆస్తులు పెంచుకోలేదు. ఇదే సమయంలో బీఎస్పీ మాత్రం తమ ఆస్తులు తగ్గినట్లు చెప్పింది. 2020-21లో రూ.732.79 కోట్లు ఉన్న ఆస్తులు.. 2021-22లో రూ.690.71 కోట్లకు తగ్గినట్లు పేర్కొన్నది.

ఇక పలు పార్టీలు తమ అప్పులను కూడా వెల్లడించాయి. కాగా, 2020-21తో పోలిస్తే 2021-22లో ఆయా పార్టీల అప్పులు మాత్రం కాస్త తగ్గాయి. 2020-21లో అన్ని పార్టీల అప్పులు రూ.103.55 కోట్లు ఉండగా.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మాత్ర రూ.62.67 కోట్లకు తగ్గిపోయాయి.

అందరి కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకే అప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఈ పార్టీకి 2020-21లో రూ.71.58 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. అయితే 2021-22లో మాత్రం అప్పులను కాస్త తగ్గించుకోగలిగింది. ప్రస్తుతం ఆ పార్టీకి రూ.41.95 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపింది. సీపీఎం పార్టీ అప్పులు రూ.16.10 కోట్ల నుంచి రూ.12.21 కోట్లకు తగ్గాయి. బీజేపీ పేరిట రూ.11.20 కోట్ల ఉన్న అప్పులు ప్రస్తుతం రూ.5.17కు తగ్గిపోయాయి.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అప్పులు రూ.3.86 కోట్ల నుంచి రూ.2.56 కోట్లకు, ఎన్సీపీ అప్పులు రూ.73.2 లక్షల నుంచి రూ.1 లక్షకు తగ్గిపోయింది. సీపీఐ పార్టీ అప్పు రూ.6.28 లక్షలుగానే ఉన్నది. బీఎస్పీ, ఎన్‌పీఈపీ తమకు ఎలాంటి అప్పులు లేవని ప్రకటించాయి.

First Published:  5 Sep 2023 6:53 AM GMT
Next Story