Telugu Global
Telangana

కుట్రలు చేసి అధికారంలోకి రావాలన్నదే బీజేపీ అజెండా : మంత్రి కేటీఆర్

తొమ్మిదేళ్లు కష్టం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. అభివృద్ధి, సంక్షేమం అనే జోడెద్దులను అద్బుతంగా సీఎం నడిపిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.

కుట్రలు చేసి అధికారంలోకి రావాలన్నదే బీజేపీ అజెండా : మంత్రి కేటీఆర్
X

ఎన్నో దశాబ్దాలు నెత్తురు పారిన తెలంగాణ నేలపై ఇప్పుడే నీళ్లు పారుతున్నాయి. కానీ బీజేపీ మరో సారి నెత్తురు పారించాలనుకుంటోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఏదో ఒక విధంగా కుట్రలు చేసి అధికారంలోకి రావాలన్నదే ఆ పార్టీ అజెండా అని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. హన్మకొండ జిల్లా ఖాజీపేటలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నక్సలిజం కావొచ్చు.. మరో సమస్య కావొచ్చు.. తెలంగాణ గడ్డపై 2014 ముందు రక్తం పారింది. రకరకాల సమస్యలతో ఇక్కడి నేల ఎన్నో బాధలను అనుభవించింది. ఇప్పుడిప్పుడే ఈ నేలపై నీళ్లు పారుతున్నాయి. ఇంటిలో నల్లా విప్పితే నీళ్లు, పంట వేసుకోవాలనుకుంటే నీళ్లు వస్తున్నాయి. కానీ బీజేపీ పార్టీ మాత్రం ఇక్కడ మరో సారి నెత్తురు పారాలని చూస్తోందని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక..తొమ్మిదేళ్లు కష్టం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. అభివృద్ధి, సంక్షేమం అనే జోడెద్దులను అద్బుతంగా సీఎం నడిపిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇలాంటి సమయంలో సంక్రాంతి గంగిరెద్దులు వచ్చినట్లు బీజేపీ, కాంగ్రెస్ వచ్చి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని.. వాళ్లు వచ్చి అంతా గోల్‌మాల్ గోవిందం కార్యక్రమాలు చేస్తారని ప్రజలను హెచ్చరించారు.

పచ్చని పొలాలు కావాలా? వద్దా?

తెలంగాణలోని యువతను కులం, మతం పేరతో కొట్టుకునేలా.. పేపర్ లీకేజీలు చేసి నిరుద్యోగులను, పిల్లలను నిరుత్సాహ పరిచేలా అనేక కుట్రలు చేస్తున్నారు. వీళ్ల లక్ష్యం.. ఏదో ఒకటి చేసి సీఎం కేసీఆర్‌ను బద్నాం చేయడమే కాక.. దాంతో నాలుగు ఓట్లు దండుకోవడమే అని మంత్రి కేటీఆర్ అన్నారు. చిల్లర ప్రయత్నమైనా, కుట్రైనా చేసి అధికారంలోకి రావాలన్నదే వారి అజెండా.. అంతే తప్ప అభివృద్ధి, సంక్షేమం అనే మాటలే ఉండవని కేటీఆర్ చెప్పారు.

ఓరుగల్లు అంటే చైతన్యవంతులకు, కవులు, కళాకారులు, మేధావులకు కేంద్రం. ఇక్కడ ఉండే ప్రతీ ఒక్కరు ఆలోచించాలి. మనకు పచ్చని పంట పొలాలు కావాలా? మతం మంటల్లో నలిగిపోయే తెలంగాణ కావాలా? మీరే ఒక్క సారి ఆలోచించండి. తెలంగాణ వచ్చాక.. ఇదే వరంగల్లులో ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో చూడండి. మేం మాటలు చెప్పడం లేదు. చేతల్లో చూపిస్తున్నాము అని కేటీఆర్ అన్నారు.

బీజేపీ ఏం చేసింది?

వరంగల్‌కు బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? ఏపీ పునర్విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. కాజీపేటలో ఫ్యాక్టరీ పెట్టుంటే వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి దొరికేది. ఇప్పటికి తొమ్మిదేళ్లు అయినా అది ఉత్త ముచ్చటగానే మిగిలిందని కేటీఆర్ అన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టడం లేదని పార్లమెంటులో ఎన్నో సార్లు అడిగినా.. ఫ్యాక్టరీ అవసరం లేదని చెప్పారని కేటీఆర్ అన్నారు.

కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కోసం 160 ఎకరాల స్థలం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఫ్యాక్టరీ అవసరం లేదని చెప్పి.. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో రూ.20వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ పెట్టారు. ఇంత కంటే మోసం ఏముంది.. బీజేపీ చేసింది ఇదే అని మంత్రి కేటీఆర్ వివరించారు.

First Published:  5 May 2023 5:50 PM GMT
Next Story