Telugu Global
Telangana

పరేడ్ గ్రౌండ్స్ కోసం పట్టు.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

ఉదయం బీజేపీ సభ ఉంటుంది, కాంగ్రెస్ నేతలు సాయంత్రం ర్యాలీ తర్వాత సభకోసం పరేడ్ గ్రౌండ్స్ అడిగారు, కానీ వారికి ఇంకా అనుమతి లభించలేదు. కుట్రతోనే తమ సభను బీజేపీ అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

పరేడ్ గ్రౌండ్స్ కోసం పట్టు.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
X

ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది కూడా విమోచన దినోత్సవం రోజున హడావిడి చేసిన కేంద్రం, ఈసారి కూడా పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. అయితే ఈసారి కాంగ్రెస్ రూపంలో వారికి పోటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలు ఈనెల 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్ లో జరగబోతున్నాయి. ఆ సమావేశాలకోసం కీలక నేతలంతా ఇక్కడకు వస్తారు. పనిలో పనిగా విమోచన దినోత్సవాన్ని కూడా పార్టీ తరపున భారీ ఎత్తున నిర్వహించాలని అనుకుంటున్నారు నేతలు. పరేడ్ గ్రౌండ్స్ లో సభకు దరఖాస్తు చేసుకున్నారు. రక్షణ శాఖ అనుమతి కోరారు.

గ్రౌండ్ ఇస్తారా..? ఇవ్వరా..?

రక్షణ శాఖ అధీనంలో ఉన్న పరేడ్ గ్రౌండ్స్ లో ఈనెల 17న బీజేపీ సభకు అనుమతిచ్చారు కానీ, కాంగ్రెస్ సభకు మాత్రం అనుమతి పెండింగ్ లో పెట్టారు. ఉదయం బీజేపీ సభ ఉంటుంది, కాంగ్రెస్ నేతలు సాయంత్రం ర్యాలీ తర్వాత సభకోసం పరేడ్ గ్రౌండ్స్ అడిగారు, కానీ వారికి ఇంకా అనుమతి లభించలేదు. కుట్రతోనే తమ సభను బీజేపీ అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

ఈ ఏడాది పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారిక కార్యక్రమం ఉంటుందని కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కార్యక్రమం పూర్తి వివరాలు, అతిథుల వివరాలు త్వరలో వెళ్లడిస్తామన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సోనియా ఆధ్వర్యంలో భారీ సభకు ప్లాన్ చేస్తోంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ అని ఎన్నికల వేళ మరోసారి బలంగా చెప్పేందుకు ఆమె ఆధ్వర్యంలోనే సభకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ పరేడ్ గ్రౌండ్స్ విషయంలో ఇంకా అనుమతి రాలేదు. ఆ అనుమతి రాకపోతే భారీ జనసమీకరణ కష్టం అవుతుంది. అందుకే కాంగ్రెస్ డైలమాలో పడింది. ప్రత్యామ్నాయంగా ఎల్బీ స్టేడియం వైపు చూస్తున్నారు నేతలు. అక్కడ కూడా అనుమతి లేకపోతే కొంగర కలాన్ ​లో సభ పెట్టాలనుకుంటున్నారు. మొత్తమ్మీద పరేడ్ గ్రౌండ్స్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య కొత్త గొడవ మొదలైంది.

First Published:  6 Sep 2023 3:14 AM GMT
Next Story