Telugu Global
Telangana

బీజేపీయే రాజగోపాల్ కొంపముంచేసిందా?

కేసీఆర్‌ వ్యూహాలు రాజగోపాల్‌కు తెలిసినట్లు బీజేపీ నేతలకు తెలియలేదేమో. అందుకనే ఉపఎన్నికలో బోల్తాపడ్డారు. కమలనాథులు ఒకటనుకుంటే చివరకు జరిగింది మరొకటి.

బీజేపీయే రాజగోపాల్ కొంపముంచేసిందా?
X

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో జరిగిందిదే. నిజానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరాలని అనుకున్నారట. అయితే బీజేపీ నేతలు అందుకు అంగీకరించలేదు. ఎందుకంటే జనరల్ ఎన్నికలు మరో ఏడాదిలో రాబోతున్నది కాబట్టి కేసీఆర్‌పై బాగా ఒత్తిడిపెంచేయాలన్నది కమలనాథుల ప్లాన్. జనాలంతా కేసీఆర్‌ పరిపాలనను వ్యతిరేకిస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం తమదే అని తెలియచెప్పటమే బీజేపీ నేతల ఆలోచన.

మునుగోడులో గెలవటం ద్వారా కేసీయార్ పై మైండ్ గేమ్ ద్వారా బాగా ఒత్తిడి పెంచేసి వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందాలని బీజేపీ నేతలు అనుకున్నారు. ఇందులో భాగంగానే రాజగోపాలరెడ్డి రాజీనామా చేయాల్సిందే అని పట్టుబట్టారట. ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండానే బీజేపీలో కంటిన్యు అవుదామనే కోమటిరెడ్డి చివరి నిమిషం వరకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే బీజేపీ నేతల వ్యూహం కేసీఆర్‌పైన ఒత్తిడి పెంచటమే కాబట్టి రాజగోపాల్ ప్రయత్నాలకు అంగీకరించలేదు.

దాంతో వేరే దారిలేక చివరకు రాజగోపాల్ రాజీనామా చేయాల్సొచ్చింది. కేసీఆర్‌ వ్యూహాలు రాజగోపాల్‌కు తెలిసినట్లు బీజేపీ నేతలకు తెలియలేదేమో. అందుకనే ఉపఎన్నికలో బోల్తాపడ్డారు. కమలనాథులు ఒకటనుకుంటే చివరకు జరిగింది మరొకటి. రాజగోపాల్‌తో రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్నపుడు ఉన్నంత ఉత్సాహం తర్వాత చాలా మంది బీజేపీ నేతలు చూపలేదు. అందుకనే ఎన్నికల ప్రచారంలో కూడా సీనియర్లు చాలా మంది నియోజకవర్గంలోకి అడుగే పెట్టలేదు. అలాగే గ్రామాల్లో ఎదురైన సమస్యల పరిష్కారానికి కూడా సీనియర్లు చొరవ చూపలేదు.

అప్పటికే రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ బీజేపీలో చేరారనే ముద్ర బలంగా పడిపోయింది. రాజగోపాల్ మీదున్న కోపానికి కేసీఆర్‌ తీసుకున్న ముందు జాగ్రత్తలు తోడవ్వటంతో కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి గెలిచారు. రాజీనామాలు చేయించిన తర్వాతే ఎమ్మెల్యేల‌ను బీజేపీలో చేర్చుకుంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్పిందంతా అబద్ధాలని అందరికీ తెలుసు. కర్నాటక, మధ్యప్రదేశ్, గోవా, పశ్చిమబెంగాల్లో ఎవ్వరితోను రాజీనామా చేయించలేదు. తెలంగాణలో మాత్రమే రాజీనామా ఎందుకు చేయించారంటే కేసీఆర్‌పై మైండ్ గేమ్ ఆడటమే ఉద్దేశం. అదే ఇప్పుడు రాజగోపాల్ కొంపముంచేసింది.

First Published:  8 Nov 2022 6:21 AM GMT
Next Story