Telugu Global
Telangana

కొనుగోళ్లతో సంబంధం లేదంటూనే.. ప్రతీ సారి 'స్టే' కోరుతున్న బీజేపీ

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నాయకుల పాత్ర ఉందని ఆడియో, వీడియోల్లో స్పష్టంగా బయటపడింది. కానీ, మొదటి నుంచి రాష్ట్ర నాయకత్వం మాత్రం తోసిపుచ్చుతూ వస్తోంది.

కొనుగోళ్లతో సంబంధం లేదంటూనే.. ప్రతీ సారి స్టే కోరుతున్న బీజేపీ
X

టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కుట్ర చేసిన కేసులో సిట్ విచారణ వేగవంతం అయ్యింది. ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో నిందితుల విచారణకు సిట్ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కేరళకు చెందిన తుషార్, బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోశ్‌, కరీంనగర్‌కు చెందిన లాయర్ శ్రీనివాస్‌లకు సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ) కింద నోటీసులు జారీ చేసింది.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నాయకుల పాత్ర ఉందని ఆడియో, వీడియోల్లో స్పష్టంగా బయటపడింది. కానీ, మొదటి నుంచి రాష్ట్ర నాయకత్వం మాత్రం తోసిపుచ్చుతూ వస్తోంది. స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఏకంగా యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయంలో తడి బట్టలతో ప్రమాణం చేశారు. బీజేపీకి ఈ కుట్రతో సంబంధం లేదని దేవుడి ముందు ఒట్టు పెట్టారు. అదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అదంతా ఫేక్ ప్రచారమని కొట్టేశారు.

మొదటి నుంచి కుట్ర కేసుతో సంబంధం లేదని వాదిస్తూనే.. విచారణ జరుగకుండా పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేసింది. తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదని, సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, కోర్టు ఆ పిటిషన్ కొట్టేసి.. సిట్ విచారణ కొనసాగించాలని ఆదేశించింది. తాజాగా బీఎల్ సంతోశ్‌ను విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేయగా.. ప్రేమేందర్ రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ ఇష్టానుసారం వ్యవహరిస్తోందని, సింగిల్ జడ్జ్ పర్మిషన్ తీసుకోకుండానే నోటీసులు ఇస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, సిట్‌ను విచారణ చేయాలని.. దాని పురోగతిని ఈ నెల 29న కోర్టుకు తెలియజేయాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే బీఎల్ సంతోశ్ సహా పలువురికి నోటీసులు ఇచ్చింది. కేసులో కీలకమైన సంతోశ్‌ను విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని బీజేపీ భయపడుతున్నట్లు కనిపిస్తున్నది. అందుకే విచారణను అడ్డుకోవడానికి మరో సారి స్టే కోరినట్లు అర్థం అవుతున్నది.

ఒకవైపు బీజేపీ తమకు సంబంధం లేదంటూనే అడుగడుగునా స్టేలు కోరడంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. మొదట్లో తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదని చెప్పారు. ఆ తర్వాత సీబీఐ ఎంక్వైరీ కోరారు. బీజేపీ అగ్రనాయకులను ఎవరిని విచారణకు పిలిచినా.. ప్రతీ సారి హైకోర్టు మెట్లు ఎక్కి స్టేలు తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే, విచారణలో ఉన్న కేసు విషయంలో స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరిస్తూ వచ్చింది. తాజాగా ఇచ్చిన నోటీసుల విషయంలో కూడా బీజేపీ అదే ధోరణి ప్రదర్శిస్తోంది. ఏదేమైనా 21న జరిగే సిట్ విచారణలో ఏం జరుగుతుందో అని బీజేపీ ఆందోళన చెందుతున్న మాట మాత్రం వాస్తవం.

First Published:  19 Nov 2022 7:19 AM GMT
Next Story