Telugu Global
Telangana

బండి సంజయ్ పోటీ చేసేది అక్కడి నుంచేనా? ఆనాటి గొడవలే గెలిపిస్తాయని అనుకుంటున్నారా?

2014, 2018లో కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి.. రెండు సార్లు కూడా టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌పై ఓడి పోయారు. మరోసారి కరీంనగర్ నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని భావించి.. నియోజకవర్గం మార్చాలని సంజయ్ డిసైడ్ అయ్యారు.

బండి సంజయ్ పోటీ చేసేది అక్కడి నుంచేనా? ఆనాటి గొడవలే గెలిపిస్తాయని అనుకుంటున్నారా?
X

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేయడంపై సందిగ్దత నెలకొన్నది. 2023లో తెలంగాణలో అధికారం చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ సారి ఎమ్మెల్యేగా ఎలాగైనా గెలిచి సీఎం రేసులో ఉండాలని సంజయ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి.. 2023లో కరీంనగర్ లేదా వేములవాడ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వేరే నియోజకవర్గాన్ని ఆయన టార్గెట్ చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

ఏబీవీపీ నుంచి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎదిగిన బండి సంజయ్.. 2005 నుంచి 2019 వరకు కరీంనగర్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. 2019లో ఆయన ఏకంగా ఎంపీగా విజయం సాధించారు. అయితే, అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న తన ఆశ మాత్రం ఇంకా కలగానే మిగిలిపోయింది. 2014, 2018లో కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి.. రెండు సార్లు కూడా టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌పై ఓడి పోయారు. మరోసారి కరీంనగర్ నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని భావించి.. నియోజకవర్గం మార్చాలని సంజయ్ డిసైడ్ అయ్యారు.

బీజేపీ అంటేనే మత రాజకీయాలు చేసే పార్టీ. ప్రతీ ఎన్నికల సమయంలో ఏదో ఒక ఉద్వేగాన్ని ప్రజల్లో ఉంచి కేంద్రంలో అధికారం దక్కించుకుంటోంది. బండి సంజయ్ కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వాలని అనుకుంటున్నారు. రాష్ట్రంలోని ముధోల్ నియోజకవర్గం కాస్త సున్నితమైన ప్రాంతం. ఈ నియోజకవర్గం పరిధిలోని భైంసా గత కొన్నాళ్లుగా వార్తల్లో ఉంటోంది. 2020లో భైంసా పట్టణంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ పట్టణంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. అక్కడి మున్సిపాలిటీలో ఎంఐఎందే అధికారం. కానీ ముధోల్ నియోజకవర్గం పరిధిలో భైంసా మున్సిపాలిటీ, మండలం మాత్రమే కాకుండా.. ముధోల్, కుంతాల, కుబీర్, లోకేశ్వరం, తానూర్, బాసర మండలాలు కూడా ఉన్నాయి.

ముధోల్ నియోజకవర్గం పరిధిలో దాదాపు 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో బండి సంజయ్ సామాజికవర్గం అయిన మున్నూరు కాపు ఓట్లు దాదాపు 50 వేల వరకు ఉన్నాయి. ఇక్కడ హిందూ- ముస్లిం గొడవలు జరుగుతుండటంతో.. ఓ వర్గం ఓట్లు తనకే పడతాయని బండి సంజయ్ భావిస్తున్నారు. తన ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత ముధోల్ నియోజకవర్గం నుంచే ప్రారంభించడానికి కారణం కూడా అదేనని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరపున విఠల్ రెడ్డి బలమైన అభ్యర్థిగా ఉన్నారు.

2004 తర్వాత 2018లో టీఆర్ఎస్ పార్టీని ముధోల్‌లో గెలిపించింది విఠల్ రెడ్డినే. ఎన్నాళ్ల నుంచో అక్కడ కాంగ్రెస్, టీడీపీ బలంగా ఉన్నాయి. కానీ 2004లో తొలి సారి నారాయణ్ రావు పటేల్ టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. 2009లో విఠల్ రెడ్డి పీఆర్పీ తరపున పోటీ చేసి 183 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున 14 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ కేవలం 29 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. 2018లో విఠల్ రెడ్డి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి 43 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ భారీగా ఓట్లను కోల్పోయింది. కేవలం 22 శాతానికే పరిమితం అయ్యింది.

బీజేపీ తరపున 2014, 2018లో పోటీ చేసిన పడకంటి రమాదేవిని ఈ సారి పక్కన పెట్టి తానే స్వయంగా రంగంలోని దిగాలని బండి సంజయ్ భావిస్తున్నారు. హిందూ-ముస్లిం మధ్య ఉన్న గొడవల కారణంగా ఓ వర్గం ఓట్లు తనకు పడతాయని సంజయ్ అంచనా వేస్తున్నారు. కరీంనగర్ లేదా వేములవాడ కంటే ముధోల్ తనకు సేఫ్ సెగ్మెంట్ అని సంజయ్ అనుకుంటున్నారు. స్థానిక క్యాడర్ కూడా బండి సంజయ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలిపిస్తామని చెబుతున్నారు. మరి సంజయ్ నిర్ణయాన్ని అధిష్టానం అంగీకరిస్తుందో లేదో వేచి చూడాలి.

First Published:  3 Dec 2022 1:07 PM GMT
Next Story