Telugu Global
Telangana

ఉద్యోగాలు, చదువులు పక్కన పెట్టండి.. మీ టైం నాకు ఇవ్వండి.. బండి సంజయ్ వింత నినాదం

'శివాజీ మహారాజ్ సేవాదల్' ఆధ్వర్యంలో పాతబస్తీలోని కార్వాన్‌లో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బండి సంజయ్ అక్కడకు వచ్చిన యువతను ఉద్దేశించి పలు ఆశ్చర్యకరమైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఉద్యోగాలు, చదువులు పక్కన పెట్టండి.. మీ టైం నాకు ఇవ్వండి.. బండి సంజయ్ వింత నినాదం
X

తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. ఎంపీ స్థాయి వ్యక్తి కాకుండా ఎవరో గల్లీ లీడర్ మాట్లాడినట్లుగా ఉంటాయి. ఏ రాజకీయ నాయకుడైనా, ప్రజా ప్రతినిధి అయినా యువత చదువుకొని, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. పార్టీ కోసమో, తన కోసమో ఒక రోజు కేటాయిస్తే.. మన హక్కుల కోసం పోరాటాలు చేద్దామని అప్పుడప్పుడు అడుగుతుంటారు. కానీ బండి సంజయ్ మాత్రం ఏకంగా చదువులు మానేయండి అని చెప్తున్నారు. ఈ వింత వ్యాఖ్యలు ఇటీవల పాతబస్తీలో జరిగిన శోభాయాత్రలో చేశారు.

Advertisement

ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా 'శివాజీ మహారాజ్ సేవాదల్' ఆధ్వర్యంలో పాతబస్తీలోని కార్వాన్‌లో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బండి సంజయ్ అక్కడకు వచ్చిన యువతను ఉద్దేశించి పలు ఆశ్చర్యకరమైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'అన్నా.. మీ చదువులు పక్కన పెట్టండి.. మీ ఉద్యోగాలు పక్కన పెట్టండి.. మీ వ్యాపారాలు పక్కన పెట్టండి.. నాతో తిరగండి.. ఒక్క ఎనిమిది నెలలు నా పక్కన తిరిగితే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం' అని వ్యాఖ్యానించారు.

Advertisement

ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. యువకులు చదువులు, వ్యాపారాలు, ఉద్యోగాలు 8 నెలలు పక్కన పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. యువతకు ఇచ్చే పిలుపు ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుడు పుట్టా విష్ణువర్దన్ రెడ్డి దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సబ్జెక్ట్ లేని మనిషి యువకులకు ఇలాంటి సందేశమేనా ఇచ్చేదని దుయ్యబట్టారు. ఏదేమైనా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకు చేతులెత్తి దండం పెడుతున్నా అని రాసుకొచ్చారు. బండి సంజయ్ ఒక జోకర్ ఎంపీ, యాక్సిడెంటల్ ఎంపీ అని ట్యాగ్ కూడా చేశారు.

పుట్టా విష్ణువర్దన్ రెడ్డి ట్వీట్‌కు పలువురు తెలంగాణ యువకులు కూడా స్పందించారు. నీ కోసం, నీ పార్టీ కోసం సామాన్య ప్రజలు ఎందుకు వాళ్ల పనులు, చదువులు, వ్యాపారాలను వదిలేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పిలుపు ఇవ్వడానికి సిగ్గు అనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ అలా రమ్మంటే ముందు మీ కొడుకును రమ్మను.. అమాయకులైన యువతతో ఎందుకు ఆటాడుకుంటారని మరొకరు కామెంట్ చేశారు. బండి సంజయ్ మాటలు ఎలా ఉన్నాయంటే.. చదువుకునే వాళ్లు, ఉద్యోగాలు చేసుకునే వాళ్లు, వ్యాపారాలు చేసే వాళ్లందరూ ఖాళీగా ఉండి టైం పాస్ చేస్తున్నట్లే ఉందని ఎద్దేవా చేస్తున్నారు.


Next Story