Telugu Global
Telangana

నిమజ్జనాలపై బీజేపీ రాజకీయం.. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన..

భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం ప్రభుత్వం తరపున విగ్రహాల నిమజ్జనం విషయంలో నిబంధనలు పాటిస్తామని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో పడవేయబోమని కోర్టుకి మాటిచ్చారు.

నిమజ్జనాలపై బీజేపీ రాజకీయం.. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన..
X

హైదరాబాద్ లో వినాయక నిమజ్జనాల విషయంలో మరోసారి బీజేపీ రాజకీయం మొదలుపెట్టింది. కాలుష్య నియంత్రణలో భాగంగా హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలపై స్టే కోసం సుప్రీంకోర్టుకి కూడా వెళ్లారు. కానీ సుప్రీం కూడా గట్టిగా చీవాట్లు పెట్టింది. భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం ప్రభుత్వం తరపున విగ్రహాల నిమజ్జనం విషయంలో నిబంధనలు పాటిస్తామని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో పడవేయబోమని కోర్టుకి మాటిచ్చారు. కానీ సరిగ్గా నిమజ్జనాల సమయంలో బీజేపీ రాజకీయం మొదలు పెట్టింది. ఇన్నిరోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు రాద్ధాంతం చేస్తోంది.

వినాయకుడంటే అందరికీ భక్తి ఉంది, కాదనలేం. కానీ ఆ వినాయక విగ్రహాలతో నీటి వనరులను కలుషితం చేస్తామంటే ఎలా..? ఇప్పటికే హుస్సేన్ సాగర్ ప్రక్షాళణ దిశగా అడుగులు పడుతున్నాయి. వాటిని భగ్నం చేసేందుకు ఈ ఏడాది పండగను అడ్డు పెట్టుకోవాలని చూస్తోంది బీజేపీ. ఖైరతాబాద్ లో సైతం మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించగా.. కొన్నిచోట్ల ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు తప్పనిసరిగా మారాయి. వాటిని స్థానిక నీటి వనరుల్లో నిమజ్జనం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కృత్రిమ కొలనులు కూడా నిర్మించారు. కానీ బీజేపీ ప్రోద్బలంతో కొందరు ససేమిరా అంటున్నారు. ఆరు నూరైనా విగ్రహాలను హుస్సేన్ సాగర్ కే తెస్తామంటున్నారు. ఇటు నిమజ్జనాలకు టైమ్ దగ్గర ప‌డుతోంది. గ్రేట‌ర్ హైదరాబాద్ కార్పొరేషన్ తరపున ట్యాంక్ బండ్ పై క్రేన్లు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయలేదు. నామ మాత్రంగా కేవలం మట్టి విగ్రహాలకోసమే క్రేన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ప్లాస్టర్ ఆప్ పారిస్ విగ్రహాలు కూడా సాగర్ కే తెస్తామంటూ బీజేపీ రాద్ధాంతం చేస్తోంది. పండగను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ కి సిద్ధపడింది.

ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉండి..

నిమజ్జనం విషయంలో తాడో పేడో తేల్చుకోవాలంటే ఈపాటికే కోర్టులో కేసులు వేయాలి. తమ వాదన వినిపించాలి. కానీ బీజేపీ నేతలు ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు తప్పంతా ప్రభుత్వంపై నెట్టేందుకు విగ్రహాల విషయంలో స్థానికుల్ని రెచ్చగొడుతున్నారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాల కోసం క్రేన్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. బీజేపీ ప్రోద్బలంతో స్థానిక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు వస్తే కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టే లెక్క. నిమజ్జనానికి ఏర్పాట్లు చేయకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు, చేస్తే.. కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వమే ఉల్లంఘించినట్టవుతుంది. అందుకే దీన్ని శాంతిభద్రతల సమస్యగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణ పౌరులను రెచ్చగొట్టాలని చూస్తోంది. బీజేపీ ట్రాప్ లో పడకుండా ఉండాలంటే.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను స్థానిక బేబీ పాండ్స్ లోనే నిమజ్జనం చేయాలి, ప్రభుత్వానికి సహకరించాలి. హుస్సేన్ సాగర్ లో కేవలం మట్టి విగ్రహాలనే నిమజ్జనం చేయాలి.

First Published:  6 Sep 2022 10:35 AM GMT
Next Story