జనసేనతో పొత్తుపై బీజేపీ పునరాలోచన..!
శనివారం సాయంత్రం కిషన్ రెడ్డి, ముఖ్యనేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్తారని సమాచారం. జనసేనతో పొత్తు, సీట్ల అంశంపై అధిష్టానంతో చర్చిస్తారని తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మిగిలిన అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తోంది టీ-బీజేపీ. ఇప్పటివరకు మూడు విడతల్లో 88 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. మిగిలిన 31 సీట్లలో అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అవుతోంది. శుక్రవారం పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, జాతీయ నేతలు ప్రకాష్ జవడేకర్, తరుణ్‌చుగ్, అరవింద్ మీనన్ సమావేశమై ఇదే అంశంపై చర్చించారు.
ఇక కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక బీజేపీ నేతలకు తలనొప్పిగా మారింది. ప్రధానంగా వేములవాడ, హుస్నాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ఈటల వర్సెస్ బండి సంజయ్‌గా మారింది. ఇక జనసేనతో పొత్తు కారణంగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి టికెట్లు సైతం పెండింగ్‌లో ఉన్నాయి.
ఇక కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాలు జనసేనకు ఇస్తే ఒప్పుకునేది లేదని స్థానిక నేతలు బీజేపీ పెద్దలకు వార్నింగ్ ఇస్తున్నారు. శేరిలింగంపల్లి టికెట్ విషయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. మరోవైపు పార్టీలో జనసేనతో పొత్తుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అసలు లీడర్, కేడర్‌లేని పార్టీతో పొత్తేంటని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ.. జనసేనతో పొత్తుపై ఆలోచనలో పడిందన్న వార్తలు వస్తున్నాయి.
శనివారం సాయంత్రం కిషన్ రెడ్డి, ముఖ్యనేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్తారని సమాచారం. జనసేనతో పొత్తు, సీట్ల అంశంపై అధిష్టానంతో చర్చిస్తారని తెలుస్తోంది. ఆరేడు సీట్ల విషయంలో పార్టీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. మొత్తానికి బీజేపీ నాలుగో జాబితాపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని సమాచారం.