Telugu Global
Telangana

బీజేపీ ఆపరేష‌న్ ఆక‌ర్ష్‌... రెండ్రోజుల్లో బీఆర్ఎస్ నుంచి ఇద్ద‌రు ఎంపీలు జంప్

బీఆర్ఎస్ నుంచి బ‌ల‌మైన నేత‌లు వ‌స్తే లోక్‌స‌భ టికెట్లిద్దామ‌న్న ఆలోచ‌న‌తోనే తెలంగాణ‌లో ఇంకా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌కుండా వేచి చూశారు.

బీజేపీ ఆపరేష‌న్ ఆక‌ర్ష్‌... రెండ్రోజుల్లో బీఆర్ఎస్ నుంచి ఇద్ద‌రు ఎంపీలు జంప్
X

లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు తెలంగాణ‌లో బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌తీసింది. నిన్న నాగ‌ర్‌క‌ర్నూలు ఎంపీ పి.రాములు త‌న కుమారుడితో క‌లిసి క‌మ‌ల‌ద‌ళంలో చేరారు. ఈరోజు జ‌హీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ కాషాయ కండువా క‌ప్పుకున్నారు. రెండు రోజుల్లో ఇద్ద‌రు సిటింగ్ ఎంపీల‌ను పార్టీలోకి తెచ్చుకున్న బీజేపీ ఇదే ఊపుతో మ‌రింత దూకుడుగా వెళ్లాల‌ని యోచిస్తోంది.

ట‌చ్‌లో ఉన్నార‌ని ముందు నుంచీ చెబుతున్నారు..

బీఆర్ఎస్ నేత‌లు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని క‌మ‌లం పార్టీ నేత‌లు ముందు నుంచే చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి బ‌ల‌మైన నేత‌లు వ‌స్తే లోక్‌స‌భ టికెట్లిద్దామ‌న్న ఆలోచ‌న‌తోనే తెలంగాణ‌లో ఇంకా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌కుండా వేచి చూశారు. మ‌హబూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్‌క‌ర్నూలు, జ‌హీరాబాద్ ఇలా కొన్ని స్థానాల్లో గెలుపు కోసం ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకెళుతున్నారు. ఆ దిశ‌గానే ఇప్ప‌టికే ఇద్ద‌రు ఎంపీల‌ను చేర్చుకోగ‌లిగారు.

బీఆర్ఎస్‌లో నైరాశ్యం..

ఈసారి కూడా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వ‌స్తుంద‌ని ప్ర‌ధాని మోడీ నుంచి పార్టీ బూత్ స్థాయి కార్య‌క‌ర్త వ‌రకు బ‌ల్ల గుద్ది చెబుతున్నారు. కేంద్రంలో పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ క‌నిపించ‌ట్లేదు. మ‌రోవైపు రాష్ట్రంలో మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిన బీఆర్ఎస్ నైరాశ్యంలో ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ వైపు వెళ్ల‌లేని నేత‌లు ప్ర‌త్యామ్నాయంగా మ‌న‌వైపు చూస్తార‌ని బీజేపీ ముందు నుంచీ లెక్క‌లు వేస్తోంది. ఇప్పుడు అవే నిజ‌మ‌వుతున్నాయి.

First Published:  1 March 2024 2:33 PM GMT
Next Story