Telugu Global
Telangana

తెలంగాణపై బీజేపీ 'అధికారికంగా' అసత్య ప్రచారం... తిప్పికొట్టిన నెటిజనులు

తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న బీజేపీ యానిమేషన్ వీడియోను ప్రతిఘటిస్తూ, FactCheck_Telangana... “రైతు బంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేదు.” అని ట్వీట్ చేసింది:

తెలంగాణపై బీజేపీ అధికారికంగా అసత్య ప్రచారం... తిప్పికొట్టిన నెటిజనులు
X

తెలంగాణ సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతి జరిగిందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేస్తున్న తప్పుడు ప్రచారం ట్విట్ట‌ర్‌లో నెటిజనుల నుండి, అధికారిక వర్గాల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.

ఆసరా పెన్షన్లు, రైతు బంధు, కల్యాణలక్ష్మి, కేంద్ర ప్రభుత్వ నిధులు, జీఎస్టీ, తెలంగాణలో జరుగుతున్న ఇతర కార్యక్రమాల్లో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ గురువారం బీజేపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ @BJP4India యానిమేషన్ వీడియోను పోస్ట్ చేసింది.

తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న బీజేపీ యానిమేషన్ వీడియోను ప్రతిఘటిస్తూ, FactCheck_తెలంగాణ.. “రైతు బంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేదు” అని ట్వీట్ చేసింది.


ఆసరా పింఛన్లలో కేంద్ర ప్రభుత్వ వాటా కేవలం 1.79 శాతం కాగా, మిగిలిన 98.21 శాతం తెలంగాణ ప్రభుత్వం భరించిందని పేర్కొంది.

“GST అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా వ్యాపారుల నుండి వసూలు చేసే పన్ను. అన్ని చెల్లింపులు ఆన్‌లైన్‌లో జరుగుతాయి.. కాబట్టి అవినీతికి ఆస్కారం లేదు. కాబట్టి, @BJP4Indiaలో పోస్ట్ చేసిన యానిమేషన్ వీడియో తప్పుదారి పట్టించేది" అని FactCheck_Telangana హ్యాండిల్ పేర్కొంది.

ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ ప్రయత్నాలపై అనేక మంది ఇతర ట్విట్టర్ వినియోగదారులు కూడా తీవ్రంగా విరుచుకపడ్డారు. తెలంగాణపై తప్పుడు ప్రచారం చేయడాన్ని కాషాయ పార్టీ మానుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.


తెలంగాణా డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, “ఈ చీప్ వీడియో చేసిన కుందేలు మెదడు గల జోకర్లకు – రైతు బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పెన్షన్ల వంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్‌లలో ఎవరైనా ఎలా అవినీతికి పాల్పడగలరు? ఈ రాష్ట్ర పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని బీజేపీ అధికార యంత్రాంగం అబద్ధం చెప్పడం సిగ్గుచేటు!'' అని ట్వీట్ చేశారు.

TSREDCO చైర్మన్ వై.సతీష్ రెడ్డి, “తెలంగాణలోని పథకాలను గొప్పగా ప్రచారం చేసినందుకు బీజేపీకి చాలా ధన్యవాదాలు, ఈ పథకాలకు మోడీ సహకారం ‘0’. తెలంగాణ ప్రజలకు మేలు చేయడమే అవినీతి అయితే.. అవును మేం అవినీతిపరులమే!'' అని ట్వీట్ చేశారు.

మరో ట్విట్టర్ యూజర్ @vasudevspeaks, “ఇలాంటి చీప్ ట్రిక్స్ కు పాల్పడటానికి @BJP4India సిగ్గుపడాలి. మీ కుట్రలు తెలంగాణ ప్రజలకు తెలుసు. నేరుగా పోరులో గెలవలేమని తెలిశాక, బీజేపీ ఈ ట్రిక్కులు ఆడుతోంది.''అని ట్వీట్ చేశారు:

First Published:  7 April 2023 2:57 AM GMT
Next Story