Telugu Global
Telangana

సెలబ్రెటీలతో బీజేపీ అగ్ర నేతల వరుస భేటీలు.. తెలంగాణలో ఏం జరుగుతోంది?

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవ్వాళ హైదరాబాద్ రాబోతున్నారు. ఆయన కూడా సెలబ్రిటీలతో భేటీ కానున్నారు. టాలీవుడ్ హీరో నితిన్ రెడ్డి, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్‌తో ఆయన సమావేశం కానున్నారు.

సెలబ్రెటీలతో బీజేపీ అగ్ర నేతల వరుస భేటీలు.. తెలంగాణలో ఏం జరుగుతోంది?
X

బీజేపీ అగ్రనేతలు ఈ మధ్య ఢిల్లీ - హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతున్నారు. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీకి.. మునుగోడు ఉపఎన్నిక కలసి వచ్చింది. ముందస్తు వ్యూహంతోనే మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చేలా బీజేపీ పక్కా స్కెచ్ గీసిందని రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్‌కు సవాలు విసరడం, దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ నాయకత్వానికి షాకివ్వడమే బీజేపీ లక్ష్యంగా ఉన్నది. ఈ ఉపఎన్నికలో గెలిస్తే కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పని చేస్తారని, ఓడితే పెద్దగా పోయేదేమీ లేదని అధిష్టానం అంచనాకు వచ్చింది. ఉప ఎన్నిక సంగతి పక్కన పెడితే.. బీజేపీ అగ్రనాయకులు హైదరాబాద్ వస్తే సెలబ్రిటీలను కలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

మునుగోడు ప్రచారానికి వచ్చిన హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీ రావును కలిశారు. రామోజీ మీడియా మొఘల్, టీడీపీకి రాజగురువు లాంటి వ్యక్తి కాబట్టి ఆ భేటీ రాజకీయాంశాలే ఉంటాయని అందరూ అంచనా వేశారు. సుదీర్ఘంగా సాగిన భేటీలో ఏం జరిగిందనేది బయటకు పూర్తిగా తెలియకపోయినా.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు గురించి చర్చ జరిగిఉంటుందని భావిస్తున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన భేటీనే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

నోవాటెల్‌లో అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిశారు. ఆర్ఎస్ఎస్‌పై తీయబోతున్న సినిమాలో నటించమని కోరడానికే తారక్‌కు కలిసినట్లు బీజేపీ లీకులు ఇచ్చింది. సినిమా షూటింగులతో బిజీగా ఉండే ఎన్టీఆర్ స్వయంగా నోవాటెల్ వెళ్లి అమిత్ షాను కలవడానికి కారణం ఏంటో? అసలు ఎవరు ఆయనను అక్కడకి తీసుకెళ్లారనేది స్పష్టంగా తెలియదు. అయితే అమిత్ షా పిలిస్తేనే జూనియర్ వెళ్లాడన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. సినిమాల గురించి మాట్లాడారా.. రాజకీయాల గురించి మాట్లాడారా అనేది మాత్రం సీక్రెట్ గానే ఉన్నది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవ్వాళ హైదరాబాద్ రాబోతున్నారు. ఆయన కూడా సెలబ్రిటీలతో భేటీ కానున్నారు. టాలీవుడ్ హీరో నితిన్ రెడ్డి, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్‌తో ఆయన సమావేశం కానున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నితిన్ గత 20 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నారు. ఆయనకు నైజాం ఏరియాలో ఫాలోయింగ్ లేదు. కానీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నితిన్ అచ్చమైన తెలంగాణ బిడ్డ. అతని తండ్రి సుధాకర్ రెడ్డి, బంధువులు దిల్ రాజు ప్రొడ్యూసర్లుగా ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో వీరికి మంచి పలుకుబడి ఉన్నది. ఈ క్రమంలో జేపీ నడ్డా శనివారం రాత్రి 7.00 గంటలకు నోవాటెల్‌లో నితిన్‌ను కలువనుండటంపై రాజకీయ, సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

ఇక ఇటీవలే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మిథాలీ రాజ్‌కు రాజకీయాలతో పెద్దగా సంబంధం లేదు. పుట్టి, పెరిగిన హైదరాబాద్‌లో కూడా ఆమెకు పెద్దగా ఫాలోయింగ్ లేదు. కానీ, జేపీ నడ్డా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆమెతో భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది. ఆమె రిటైర్మెంట్ ప్రకటనలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేరు ప్రస్తావించకుండా కేవలం కార్యదర్శి జై షా కి మాత్రమే కృతజ్ఞతలు తెలిపారు. జై షా స్వయంగా హోం మంత్రి అమిత్ షా కొడుకు అనే విషయం తెలిసిందే. త్వరలో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని తన రిటైర్మెంట్ లేఖలో మిథాలీ పేర్కొన్నది. అంటే రాజకీయాల్లోకి రావాలని ఏమైనా భావిస్తున్నదా? బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నదా? అనే అనుమానాలు వస్తున్నాయి.

ఏదేమైనా.. బీజేపీ అగ్రనేతలు వరుసగా సెలబ్రిటీలతో సమావేశాలు అవడం చూస్తుంటే.. ఏదో భారీ ప్రణాళికలోనే ఉన్నదని అర్థం అవుతోంది. ఈ భేటీలన్నీ తెలంగాణ లక్ష్యంగానే సాగుతున్నాయనే ప్రచారమూ జరుగుతోంది. తెలంగాణ బీజేపీకి గ్లామర్ టచ్ ఇవ్వడానికే ఈ మంతనాలు సాగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే ఈ భేటీల సారాంశం తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయక తప్పదు.

First Published:  27 Aug 2022 2:11 AM GMT
Next Story