Telugu Global
Telangana

ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఇల్లు కట్టుకున్నా, కొడుకు పెళ్లి చేసిన.. బీజేపీ ఎంపీ సోయం బాపూరావు

అదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు మాత్రం ఎంపీ ల్యాడ్స్ ఉపయోగించి ఇల్లు కట్టుకున్నానని, కుమారుడి పెళ్లి కూడా చేశానని కుండ బద్దలు కొట్టారు.

ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఇల్లు కట్టుకున్నా, కొడుకు పెళ్లి చేసిన.. బీజేపీ ఎంపీ సోయం బాపూరావు
X

లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఎంపీ ల్యాడ్స్ (లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ స్కీం) కింద నిధులు కేటాయిస్తుంటారు. ఆయా ప్రాంతాల్లోని ఎంపీల విచక్షణ మేరకు ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపడతారు. చాలా వరకు ఎంపీ ల్యాడ్స్ నిధులు పక్కదోవ పడుతున్నాయని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు నిజం చేస్తూ.. బీజేపీ ఎంపీ నిధులను తన సొంత పనులకు ఎలా వాడుకున్నారో బహిరంగంగా చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.

బీజేపీ అంటే అవినీతి రహితమైన పార్టీ అని ప్రచారం చేసుకుంటారు. కానీ అదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు మాత్రం ఎంపీ ల్యాడ్స్ ఉపయోగించి ఇల్లు కట్టుకున్నానని, కుమారుడి పెళ్లి కూడా చేశానని కుండ బద్దలు కొట్టారు. గతంలో ఉన్న ఎంపీలు మొత్తం నిధులను వాడుకున్నారు. కానీ నేను మాత్రం ఇల్లు కట్టుకొని, పెళ్లి చేశాను. మిగిలిన నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగిస్తానని చెప్పడం గమనార్హం. సోమవారం ఎంపీ సోయం బాపూరావు బీజేపీ ప్రజాప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ..

'ఎంపీ ల్యాడ్స్ కింద రెండో సారి రెండున్నర కోట్లు వస్తున్నాయి. దాంట్లో కొన్ని నిధులు ఎంపీటీసీ, కౌన్సిలర్లకు ఇవ్వాలని అనుకుంటున్నాను. నాకు ఇక్కడ ఇల్లు లేదు. దీంతో నాకు వాల్యూ ఉండదని గ్రహించి.. మొదటి దఫా నిధులతో ఇంటి నిర్మాణం చేపట్టాను. నా కుమారుడి పెళ్లి కోసం.. మరి కొంత సొమ్మును వాడాను. ఇలాంటి విషయాలు ఏ నాయకుడు కూడా చెప్పరు. కానీ నేను బాహాటంగానే చెప్తున్నాను' అంటూ సమర్థించుకున్నారు. తన కంటే ముందు ఉన్న ఎంపీలు మొత్తం నిధులను సొంతానికే వాడుకున్నారని.. తాను మాత్రమే కొన్ని నిధులనే సొంతానకు వాడుకున్నానని చెప్పుకొచ్చారు.

నేను నిధులు వాడుకున్నానని సొంత పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. కానీ అంతకు ముందు ఉన్న ఎంపీలు ఎంత తిన్నారో మాత్రం వాళ్లు గ్రహించడం లేదని మండిపడ్డారు. తెలంగాణలోని ఏ ఎంపీకి కూడా రూ.5 కోట్లు రాలేదు. సొంత పార్టీ వారైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌కు కూడా రాలేదు. కానీ నాకు మాత్రం డబ్బులు వచ్చాయి. నిన్ననే అకౌంట్‌లో డబ్బులు పడుతున్నట్లు నా పీఏ ఫోన్ చేసి చెప్పాడు. అందుకే ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు ఇవ్వాలని రాత్రికి రాత్రే డిసైడ్ అయ్యానంటూ బాపూరావు చెప్పారు.

ఈ డబ్బులు కూడా నేను వాడుకోవచ్చు. కానీ మొదటి సారి మొత్తం నేనే వాడుకున్నాను. కాబట్టి ఈ డబ్బులు మీకు ఇస్తున్నాను. రెండో సారి కూడా వాడుకుంటే నన్ను మీరు మనిషిగా కూడా చూడరంటూ సెంటిమెంట్ కూడా కురిపించారు. కాగా, ఎంపీ సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒక ఎంపీ తనకు వచ్చిన నిధులను ప్రజలకు ఖర్చు చేయకుండా సొంతానికి వాడుకోవడం ఏంటని.. పైగా అదేదో గొప్ప పని చేసినట్లు చెప్పుకోవడం ఏమిటని మండిపడుతున్నారు. నిధులు సొంతానికి వాడుకొని దుర్వినియోగం చేసినందుకు గాను ఎంపీ సోయం బాపూరావుపై చర్యలు తీసుకోవాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

First Published:  19 Jun 2023 6:49 AM GMT
Next Story