Telugu Global
Telangana

అబ్బెబ్బే టీడీపీతో కలవం.. బీజేపీ మాటలు ఎలా నమ్మగలం..?

వారికి టీడీపీ ఓటు బ్యాంక్ కావాలి, దానికోసమే చంద్రబాబుని దగ్గరకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికిప్పుడు చంద్రబాబుని కలవకపోయినా, ఎన్టీఆర్ ని అమిత్ షా కలవడం ఆ వ్యూహంలో భాగమేనని వినపడుతోంది.

అబ్బెబ్బే టీడీపీతో కలవం.. బీజేపీ మాటలు ఎలా నమ్మగలం..?
X

తెలంగాణలో కమ్మ ఓటు బ్యాంక్ కోసం బీజేపీ కాచుకు కూర్చుందనే విషయం తెలిసిందే. టీడీపీ ఎలాగూ తెలంగాణలో పొడిచేది లేదని అర్థమైపోయింది. ఆ సాంప్రదాయ ఓటు బ్యాంకుని టీడీపీ మద్దతుతో బీజేపీ కైవసం చేసుకోవాలనుకుంటోంది. పరోక్షంగా మద్దతు కోరడమా, లేక పొత్తు పెట్టుకోవడమా అనే విషయం తేలడంలేదు. అటు వామపక్షాలు టీఆర్ఎస్ తో కలసి ప్రయాణం చేస్తాయనే విషయం తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ కోదండరాం సహా, టీఆర్ఎస్ పై గుర్రుగా ఉన్న కొంతమంది ఉద్యమకారుల మద్దతు కోరుతోంది. ఇక మిగిలింది బీజేపీయే. వైఎస్సార్టీపీకి బీజేపీ మద్దతు ఉందని, కాంగ్రెస్ ఓటుబ్యాంక్ కి గండి కొట్టేందుకే వారు పరోక్షంగా షర్మిలను సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ ప్రచారం ఎలా ఉన్నా.. వారికి టీడీపీ ఓటు బ్యాంక్ కావాలి, దానికోసమే చంద్రబాబుని దగ్గరకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికిప్పుడు చంద్రబాబుని కలవకపోయినా, ఎన్టీఆర్ ని అమిత్ షా కలవడం ఆ వ్యూహంలో భాగమేనని వినపడుతోంది.

టీడీపీతో కలవం..

తెరవెనక ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నా.. తెలంగాణలో టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని చెబుతున్నారు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ లక్ష్మణ్‌. తెలంగాణలో బీజేపీ ఒంటరిపోరుకే సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. అదే సమయంలో ఏపీలో కేవలం జనసేనతోనే పొత్తులో ఉన్నామని, ఆ పార్టీతోనే కలసి ప్రయాణిస్తామంటున్నారు. కానీ జనసేనాని వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను, పొత్తులకు సై అని ఇస్తున్న సిగ్నల్స్ గురించి మాత్రం లక్ష్మణ్ ప్రస్తావించడంలేదు.

ఒంటరిపోరు చేసే ధైర్యముందా..?

రెండు ఉప ఎన్నికల్లో గెలుపు, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉనికి చాటుకున్నంత మాత్రాన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనేది భ్రమ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటు ఏపీలో కూడా అదే పరిస్థితి. తెలంగాణలో కనీసం ముగ్గురు ఎమ్మెల్యేలయినా ఉన్నారు, ఏపీలో ఒక సర్పంచ్ కూడా బీజేపీకి లేరు. ఈ దశలో ఇక్కడ కూడా ఆ పార్టీ జనసేనతోపాటు టీడీపీతో పొత్తుపెట్టుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. అటు తెలంగాణలో, ఇటు ఏపీలో.. పొత్తులకోసం వెంపర్లాడుతున్న బీజేపీ.. ఒంటరి పోరు అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. మునుగోడు ఫలితాల తర్వాత బీజేపీకి వాస్తవం బోధపడే అవకాశముందని అంటున్నారు.

First Published:  1 Sep 2022 11:47 AM GMT
Next Story