Telugu Global
Telangana

నేను సీఎం అభ్యర్థిని కాను.. కొత్త వివాదం రాజేసిన ఈటల..

బీజేపీలో సీఎం కుర్చీకోసం పేచీ మొదలైందనే వాదన వినిపిస్తోంది. బండి సంజయ్ తన పేరు ఖరారు చేసుకోవ‌డానికి కష్టపడుతున్నారు, మరోవైపు కిషన్ రెడ్డికి కూడా ఆ ఆశ ఉండనే ఉంది, తాజాగా ఈ లిస్ట్ లో చేరారు ఈటల రాజేందర్.

నేను సీఎం అభ్యర్థిని కాను.. కొత్త వివాదం రాజేసిన ఈటల..
X

తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే సీఎం ఎవరు అనే అంశంపై ఎక్కడా సందేహం లేదు. కానీ బీజేపీ, కాంగ్రెస్ లో ఏ పార్టీ గెలిచినా సీఎం ఎవరనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఆ మాటకొస్తే క్లారిటీ వస్తేనే ఆ రెండు పార్టీల్లో అత్యంత ప్రమాదం. అందుకే అధిష్టానాలు కూడా ఊహాగానాలకే మద్దతిస్తుంటాయి. అయితే తాజాగా బీజేపీలో సీఎం కుర్చీకోసం పేచీ మొదలైందనే వాదన వినిపిస్తోంది. బండి సంజయ్ తన పేరు ఖరారు చేసుకోవ‌డానికి కష్టపడుతున్నారు, మరోవైపు కిషన్ రెడ్డికి కూడా ఆ ఆశ ఉండనే ఉంది, తాజాగా ఈ లిస్ట్ లో చేరారు ఈటల రాజేందర్. తాను సీఎం అభ్య‌ర్థిని అంటూ వస్తున్న వార్తల్ని ఖండిస్తున్నట్టు చెప్పారు ఈటల.

Advertisement

లీకులిచ్చింది ఎవరు..?

గతంలో మీడియా ద్వారా లీకులివ్వాలంటే కాస్త కష్టమైన పనే, ఇప్పుడు సోషల్ మీడియా చేతికొచ్చే సరికి మనసులో మాటను ఏదో ఒక రూపంలో బయటపెట్టేందుకు నాయకులు వెనకాడటంలేదు. ముందుగా లేనిపోని పుకార్లు వ్యాప్తి చేయడం, జనం రియాక్షన్ ని బట్టి వాటిని ఖండించడం, లేదా స్వాగతించడం.. ఇలా చేస్తే సరిపోతుంది. ఈటల కూడా అదే పంథాలో వెళ్లారని ఆయన వైరి వర్గాలంటున్నాయి. ముందుగా ఈటల సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ కావడం, ఆ తర్వాత తీరిగ్గా ఆయన ఆ వార్తల్ని ఖండించడం.. ఇవన్నీ ఓ పద్ధతి ప్రకారం జరిగాయని అంటున్నారు. మొత్తానికి బండి సంజయ్ కి మాత్రం ఈటల పెద్ద షాకిచ్చినట్టయింది.

Advertisement

ముఖ్యమంత్రి అభ్యర్థిని కానంటూనే..!

బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు ఈటల రాజేందర్. పదవులను వ్యక్తులు నిర్ణయించుకోలేరని, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తారని వివరించారాయన. నేతల సామర్థ్యాన్ని గుర్తించి పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు ఈటల. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయడం కోసం పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. ప్రస్తుతం ఈటల మాటల్లోని గూడార్థాలు కనిపెట్టే పనిలో ఉన్నారు ఆ పార్టీ నేతలు. ఇటీవల కాలంలో బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ ఫేస్ గా దూసుకెళ్తున్నారు. సీఎం అభ్యర్థిగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అనే హోదాలో పాదయాత్రల పేరుతో రాష్ట్రమంతా చుట్టొస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ కూడా ప్రస్తుతానికి బండికి అనుకూలంగానే ఉంది. ఇక సీఎం కుర్చీ విషయం బీజేపీ గెలిచినప్పుడు ఆలోచించాలి. మూడు ఎమ్మెల్యే స్థానాలున్న బీజేపీ వచ్చే దఫా ఏకంగా అధికార పార్టీగా మారుతుందనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ అత్యాశకు తోడు ఇప్పుడు స్వయం ప్రకటిత సీఎం అభ్యర్థులు ఎక్కువయ్యారంటే మాత్రం ఎన్నికల ముందు అంతర్గత కుమ్ములాటలు ఖాయం.

Next Story